భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న బజాజ్ కంపెనీ వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్..!
స్వతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఇందులో వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు.
స్వతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఇందులో వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. భారతదేశపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటైన బజాజ్ గ్రూప్ స్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ కూడా పాల్గొన్నారు. ఆయనను మహాత్మా గాంధీ తన ఐదో కొడుకుగా అభివర్ణించారు. జమ్నాలాల్ 1889లో రాజస్థాన్‌లోని సికార్‌లో సంపన్న మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయనను చిన్నతనంలో మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన బంధువు, ధనిక వ్యాపారవేత్త సేథ్ బచ్చరాజ్ దత్తత తీసుకున్నారు. జమ్నాలాల్ మొదట తన పెంపుడు తండ్రి వ్యాపారంలో నిర్వహించారు. తరువాత సొంతంగా చక్కెర మిల్లును స్థాపించారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జమ్నాలాల్‌కు విరాళాలు ఇచ్చినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రాయ్ బహదూర్ బిరుదును ప్రదానం చేసింది.మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి రావడం, స్వాతంత్ర పోరాటాన్ని చేపట్టడంతో చాలా మంది భారతీయులు జాతీయ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వారిలో జమ్నాలాల్ కూడా ఉన్నారు. ఆయన గాంధీ ఆదర్శాలకు అమితమైనంగా ఆరాధకుడయ్యారు. జమ్నాలాల్ కాంగ్రెస్‌లో చేరారు. భార్య జానకీదేవితో కలిసి గుజరాత్‌లోని సబర్మతిలోని గాంధీ ఆశ్రమంలో ఉండిపోయారు. 1920లో జమ్నాలాల్ కాంగ్రెస్ నాగ్‌పూర్ సెషన్ రిసెప్షన్ కమిటీకి నాయకత్వం వహించారు. జమ్నాలాల్ మరుసటి సంవత్సరం సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, రాయ్ బహదూర్ అనే బిరుదును వదులుకున్నారు. ఆయన జెండా సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. ఆయన అరెస్టు కూడా అయ్యారు. 1931లో గాంధీజీ సబర్మతీ ఆశ్రమాన్ని విడిచిపెట్టినప్పుడు జమ్నాలాల్ తన గ్రామం వార్దాలో ఆశ్రమం కోసం భూమిని ఇచ్చారు. అక్కడ కొత్తగా ఆశ్రమాన్ని ప్రారంభించాలని గాంధీ కోరారు. చివరికి ఒప్పించారు. దీంతో అక్కడ గాంధీజీ సేవాగ్రామ్ ఆశ్రమం ఏర్పాటు చేశారు. జమ్నాలాల్ 1930లలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, పార్టీ కోశాధికారిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, ఖాదీ, హిందీ ప్రచారం కోసం గాంధీయన్ ప్రచారాలలో జమ్నాలాల్ చురుకుగా పాల్గొన్నారు. దేవాలయాల్లో దళితులను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. 1928లో వార్ధాలోని తన కుటుంబ ఆలయమైన లక్ష్మీ నారాయణ ఆలయాన్ని దళితుల కోసం తెరిచి, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి చరిత్ర సృష్టించారు. జమ్నాలాల్ హిందూ ముస్లిం ఐక్యతను నెలకొల్పడంలో ముందంజలో ఉన్నారు. ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపక కోశాధికారిగా కూడా ఉన్నారు. ఆయన అఖిల భారత హిందీ సాహిత్య సమ్మేళనం, దక్షిణ్ భారత్ హిందీ ప్రచార సభ వ్యవస్థాపకులలో కూడా ఒకరు. జమ్నాలాల్ 1942లో 52 ఏళ్ల వయసులో మరణించారు. కాగా ఆయన స్థాపించిన బజాజ్ గ్రూప్ మార్కెట్ క్యాపిటల్ విలువ నేడు రూ. 8 లక్షల కోట్లుగా ఉంది.