Asianet News TeluguAsianet News Telugu

గాంధీజీతో పాటుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న బ్రిటిష్ మహిళ మీరా బెహెన్

11భారత స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన విదేశీయుల్లో మీరాబెన్ పేరు ప్రముఖంగా ఉంటుంది.

First Published Jun 15, 2022, 1:04 PM IST | Last Updated Jun 15, 2022, 1:04 PM IST

11భారత స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన విదేశీయుల్లో మీరాబెన్ పేరు ప్రముఖంగా ఉంటుంది. గాంధీ సిద్ధాంతాలతో ఆకర్షితురాలైన మీరాబెన్ ఆయన అనుచరురాలిగా, ఉద్యమాల్లో కామ్రేడ్‌గా ఉన్నారు. గాంధీ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడానికి ఆమె 34 సంవత్సరాలు భారత్‌లో గడిపారు.మీరాబెన్ అసలు పేరు మెడెలెయిన్ స్లేడ్. సర్ ఎడ్మండ్ స్లేడ్, ఫ్లోరెన్స్ మెడెలెయిన్‌ల దంపతులకు యూకే రాజధాని లండన్‌లో 1892లో ఆమె జన్మించారు. వారిది కులీన కుటుంబం. సర్ అడ్మండ్ స్లేడ్ రాయల్ బ్రిటీష్ నేవీలో అడ్మైరల్‌గా బాధ్యతలు చేపట్టారు.మెడెలెయిన్ స్లేడ్ తన యవ్వనంలో 18వ శతాబ్దికి చెందిన జర్మన్ కంపోజర్ లుడ్విగ్ వ్యాన్ బీథోవేన్ సంగీతం అంటే ప్రాణమిచ్చేది. ఆ సంగీతం గురించి తెలుసుకోవడానికి విదేశాలూ తిరిగింది. ఈ క్రమంలో ఆమె ఫ్రెంచ్ రైటర్ రొమెయిన్ రోలాండ్‌ను కలిశారు. రొమెయిన్ రోలాండ్‌ను కలవడం ఆమె జీవితాన్నే మార్చేసిన ఘట్టంగా మిగిలింది. మహాత్మా గాంధీ జీవిత చరిత్రను రోలాండ్ రాశారు. ఆ పుస్తకాన్ని మెడెలెయిన్ స్లేడ్‌కు ఇచ్చారు. 20వ శతాబ్దపు గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అంటూ ఆ పుస్తకం వర్ణించింది. ఆ పుస్తకం చదివిన మెడెలెయిన్ స్లేడ్ మహాత్మా గాంధీ సిద్ధాంతం గురించి, ఆయన జీవన విధానం గురించి తెలుసుకుని ఆకర్షితురాలైంది. వెంటనే ఆమె మహాత్మా గాంధీకి ఓ లేఖ రాశారు. ఆయన ఆశ్రమంలో చేరడానికి అనుమతి కావాలని అందులో కోరారు. ఇందుకు మహాత్మా గాంధీ కూడా సానుకూలంగా సమాధానం ఇచ్చారు. తన ఆశ్రమంలో చేరాలంటే కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందుకు సమ్మతమైతే చేరవచ్చని తెలిపారు. ఇందుకు అంగీకరించిన మెడెలెయిన్ స్లేడ్  1925 నవంబర్ 7న అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమానికి విచ్చేశారు. శాకాహారమే భుజిస్తానని, మద్యం ముట్టనని, బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని ఆమె ప్రమాణం తీసుకున్నారు. ఆమె హిందీ నేర్చుకున్నారు. నూలు వడకడం కూడా నేర్చుకున్నారు. అనంతరం మహాత్మా గాంధీనే ఆమెకు మీరా అని పేరు పెట్టారు.మహాత్మా గాంధీతోపాటు ఆమె పలు పోరాటాల్లో పాలుపంచుకున్నారు. 1930లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె గాంధీ వెంట వెళ్లారు. సహాయ నిరాకరణోద్యమంలో గాంధీతోపాటు పాల్గొని జైలుకు వెళ్లారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో 1942లో గాంధీ, ఆయన సతీమణి కస్తుర్బాలతోపాటు మీరాబెన్‌ను కూడా పూణెలోని ఆగా ఖాన్ ప్యాలెస్ గృహ నిర్బంధంలో ఉంచారు. కస్తుర్బా అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరాబెన్ ఆమెకు సేవలు చేశారు. ఆగా ఖాన్ ప్యాలెస్‌లోనే కస్తుర్బా గాంధీ తుదిశ్వాస విడిచారు.మహాత్మా గాంధీ హత్య జరిగిన తర్వాత కూడా మీరాబెన్ మరో 11 ఏళ్లు ఇండియాలోనే గడిపారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను, సూత్రాలను స్వతంత్ర భారతంలో అమలు చేయాలని ఆమె ప్రయత్నించారు. గాంధీ ఆశించినట్టుగా స్వయం సమృద్ధిగా ఎదిగే గ్రామాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. చోటా నాగ్‌పూర్‌లో గిరిజనుల జీవితాలను మెరుగుపరచడానికి పని చేశారు. హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేతకు వ్యతిరకంగా ఉద్యమించారు. 64 ఏళ్ల వయసులో 1959లో ఆమె ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆస్ట్రియాకు వెళ్లి తన యవ్వన కాలంలో ఇష్టపడ్డ బీథోవేన్ సంగీతాన్ని నేర్చుకున్నారు. బీథోవేన్ నివసించిన గ్రామాల్లోనే ఆమె తన జీవిత చివరి అంకాన్ని గడిపారు. 1982లో ఆస్ట్రియాలోనే మీరాబెన్ మరణించారు. ఆమె మరణానికి ఒక ఏడాది ముందు భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.