ఆగష్టు తిరుగుబాటు రాణి -అరుణ అసఫ్ అలీ
భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో మరపురాని రోజు 9 ఆగస్ట్ 1942.
భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో మరపురాని రోజు 9 ఆగస్ట్ 1942. ఇదే రోజున బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. క్విట్ ఇండియా పోరాటానికి ఇక్కడే పునాదిరాయి పడింది. అంతవరకు శాంతియుతంగా పోరాటం సాగించిన మహాత్మా గాంధీ.. ఆంగ్లేయులపై తిరుగుబాటును ప్రకటిస్తూ.. డూ ఆర్ డైకి పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టే వరకు విశ్రమించకండి.. పోరాటం సాగించండి అంటూ సాగిన గాంధీ ప్రసంగం తర్వాత.. ఒక 33 ఏళ్ల మహిళ భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ.. బ్రిటిష్ పాలకులపై పోరాటానికి ప్రారంభించి.. భారత స్వేచ్ఛ కోసం సాగిన స్వాతంత్య్ర ఉద్యమంలో చెరగని ముద్రవేసింది. ఆగస్ట్ విప్లవం రాణిగా పేరుగాంచిన ఆమె ఎవరోకాదు భారత వీర వనిత అరుణా అసఫ్ అలీ.
పంజాబ్‌లోని కల్కాలో ప్రముఖ బ్రహ్మ సమాజి బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అరుణా కళాశాలలో ఉండగానే స్వాతంత్య్ర ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. తన చిన్నతనం నుండి తిరుగుబాటుదారు, తన కుటుంబం అభ్యంతరాలు ఉన్నప్పటికీ ముస్లిం మతానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అసఫ్ అలీని వివాహం చేసుకుంది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అరుణను అరెస్టు చేశారు. రాజకీయ ఖైదీల హక్కుల కోసం ఆమె తీహార్ జైలులో నిరాహార దీక్ష కూడా చేశారు. రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన ఏకైక ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలైన ఆమె వామపక్ష భావజాలానికి వెళ్లారు. ఆమె మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ తర్వాత సోషలిస్టు పార్టీలో చేరారు. ఆమె జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా సహచరురాలు.
ఉద్యమలో బ్రిటిష్ చర్యల కారణంగా ఆమె అండర్‌గ్రౌండ్‌కి వెళ్లగా.. అరుణ ఆస్తులను జప్తు చేయడంతో పాటు ఆమెను పట్టుకున్న వారికి 5000 రూపాయల రివార్డు ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం అరుణ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఢిల్లీకి తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె మహిళల హక్కుల కోసం తన గళాన్ని వినిపించారు. ప్రముఖ పాత్రికేయుడు ఎడతట్ట నారాయణన్‌తో కలిసి ఆమె పేట్రియాట్, లింక్ వంటి ప్రచురణలను ప్రారంభించారు. అరుణ ప్రఖ్యాత లెనిన్ ప్రైజ్, నెహ్రూ ప్రైజ్, పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు. మరణానంతరం భారతరత్న అవార్డును అందుకున్నారు. అరుణా అసఫ్ అలీ 1997లో 86వ ఏట తుదిశ్వాస విడిచారు.