Asianet News TeluguAsianet News Telugu

విదేశీ గడ్డ మీద తొలిసారి భారతీయ జెండాను ఎగరేసిన మహిళ మేడం కామా

టాటా, గోద్రెజ్, వాడియా.. ఈ పార్సీ కుటుంబాలు స్వాతంత్య్రానికి ముందు నుంచి భారతీయ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నాయి. 

First Published Jun 20, 2022, 11:11 AM IST | Last Updated Jun 20, 2022, 11:11 AM IST

టాటా, గోద్రెజ్, వాడియా.. ఈ పార్సీ కుటుంబాలు స్వాతంత్య్రానికి ముందు నుంచి భారతీయ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నాయి. చాలా సంవ‌త్స‌రాల క్రితం పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చిన ఈ జొరాస్ట్రియన్ కమ్యూనిటీ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీల‌క పాత్ర పోషించింది. ఈ వ‌ర్గాల‌కు చెందిన అనేక మంది భారత స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. వీరిలో మొద‌ట‌గా వినిపించే పేరు భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుల్లో ఒకరైన దాదాభాయ్ నౌరోజీతో పాటు లండన్‌లో భారత స్వాతంత్య్రానికి గొప్ప ప్రచారకర్త, విదేశీ గడ్డపై తొలిసారిగా భారత జెండాను ఎగురవేసిన మేడమ్ కామా వంటి మహిళలు, దండిమార్చిలో గాంధీజీతో కలిసి నడిచిన మిట్టుబెన్ హోర్ముస్జీ వంటి వారు ఉన్నారు. 

విదేశీ గ‌డ్డ‌పై భారత స్వాతంత్య్ర గొంతుకను వినిపించారు భిఖాజీ రుస్తోమ్ కామా (మేడమ్ కామా). ఆమె ఒక  స్వాతంత్య్ర‌ సమరయోధురాలు, మహిళా హక్కుల కార్యకర్త, బలమైన సోషలిస్ట్ నాయ‌కురాలు. 1861లో బొంబాయిలోని ఒక సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించిన కామా, తన చిన్న వయస్సు నుండే వివిధ సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంది. బొంబాయిలో కరువు, ప్లేగు విస్త‌రించిన స‌మ‌యంలో ఆమె స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేసింది. మేడమ్ కామా కూడా ప్లేగు వ్యాధి బారిన పడి చికిత్స కోసం లండన్ వెళ్లారు. లండన్‌లో ఆమె నౌరోజీని కలుసుకుంది. భారత స్వాతంత్య్రం కోసం ప్రచారంలో భాగ‌మైంది.  హోమ్ రూల్ సొసైటీలో హర్ దయాల్, శ్యామ్‌జీ కృష్ణ వర్మ వంటి భారతీయ జాతీయవాదులతో కలిసి ముందుకుసాగింది. 

కామా జాతీయవాద కార్యకలాపాల కారణంగా, బ్రిటీష్ ప్రభుత్వం ఆమెను భారతదేశానికి తిరిగి రావడానికి అనుమతించలేదు. ఆమెను పారిస్‌కు తరలించేలా బ్రిటిష్ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంది. అక్కడ కూడా ఆమె భారతీయ ప్రవాస జాతీయవాదులు పారిస్ ఇండియన్ సొసైటీతో కలిసి భారతీయుల ప్రయోజనాల కోసం తన పనిని కొనసాగించారు. బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం విల్లీని హత్య చేసినందుకు బ్రిటన్ చేత ఉరితీయబడిన భారతీయ విప్లవకారుడు మదన్‌లాల్ ధింగ్రా పేరు మీద ఆమె “మదన్స్ తల్వార్” అనే ప్రచురణను ప్రారంభించింది. దీంతో కామాను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌ ఫ్రాన్స్‌ను కోరింది. కానీ ఫ్రాన్స్ నిరాకరించడంతో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని ఆమె ఆస్తులను జప్తు చేసింది.

ఈ నేప‌థ్యంలోనే సోవియట్ యూనియన్‌లో స్థిరపడాలని లెనిన్ ఆమెను ఆహ్వానించాడు. 1907లో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టుల సదస్సులో కామా తొలిసారిగా ఒక విదేశీ దేశంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆమె మహిళలకు ఓటు హక్కును డిమాండ్ చేస్తూ ఓటు హక్కు ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మిత్రదేశాలుగా మారడంతో కామాను అరెస్టు చేసి పారిస్ నుండి బహిష్కరించారు. ఆమె వివిధ యూరోపియన్ దేశాలలో చాలా సంవత్సరాలు గడపాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే తీవ్రమైన అనారోగ్యానికి గురికావ‌డంతో తిరిగి భార‌త్ కు రావ‌డానికి బ్రిటిష్ స‌ర్కారు అనుమ‌తించింది. అయితే, ఆమె ఆరోగ్యం మ‌రింత‌గా క్షీణించ‌డంతో 74 ఏండ్ల వ‌య‌స్సులో ఆమె తుదిశ్వాస విడిచారు. మెడ‌మ్ కామాను Mother of the Indian Revolution అని కూడా పిలుస్తారు.