మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు (వీడియో)
ఆదివారం కార్తీక సోమవారాలు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం చేరుకొని వేకువజామునే పాతాళ గంగ వద్దకు చేరుకొని పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు
శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకమాసంలో భక్తులు శివపార్వతులను దర్శించుకుంటే కోటిజన్మల పుణ్య ఫలం దక్కుతుందనే నమ్మకం తో భారీ ఎత్తున భక్తులు శ్రీశైలానికి చేరుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివారం కార్తీక సోమవారాలు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం చేరుకొని వేకువజామునే పాతాళ గంగ వద్దకు చేరుకొని పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు.
అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ పూలతో వాయనం సమర్పిస్తున్నారు. కృష్ణానది వద్ద కార్తీక దీపాన్ని వెలిగించి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకొని గంగాధర మండపం,నాగులకట్ట ఉసిరి వన సముదాయం వద్ద కార్తీక దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు దర్శన ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భక్తులకు క్యూలైన్లలో అల్పాహారం మంచినీటి వసతి, పాలు వితరణ కార్యక్రమాలు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఆలయ వేళల్లో కూడా మార్పులు చేశారు. అంతేకాక అభిషేకాలు, ఆర్జిత సేవల 5000 అభిషేకం టికెట్లను రద్దు చేశారు.