వైసిపి గూటికి గంజి చిరంజీవి... మంగళగిరిలో పోటీపై ఎమ్మెల్యే ఆర్కే క్లారిటీ
మంగళగిరి : ఇటీవలే టిడిపి పార్టీకి రాజీనామా చేసిన గంజి చిరంజీవి ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
మంగళగిరి : ఇటీవలే టిడిపి పార్టీకి రాజీనామా చేసిన గంజి చిరంజీవి ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో చిరంజీవి వైసిపి తరపున పోటీచేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కొట్టిపారేసారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వందకు వందశాతం తానే వైసిపి తరపున మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీ చేస్తానని ఆర్కే స్పష్టం చేసారు. అయితే వైసిపిలో చేరిన గంజి చిరంజీవిని ఆర్కె ప్రశంసించారు. మూడు శాఖలకు మంత్రి, సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా వుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నారా లోకేష్ తన చేతిలో 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడని ఆర్కే అన్నారు. అంతకుముందు పోటీచేసిన చిరంజీవి అతి తక్కువ ఓట్లతో ఓటమిపాలయ్యారని అన్నారు. కాబట్టి ఇద్దరిలో ఎవరుగొప్పో లోకేష్ గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలని సూచించారు. మంగళగిరిలో లోకేషే పోటీ చేయాలని కోరుకుంటున్నానని... ఎన్నిజన్మలెత్తినా ఆయన గెలుపు అసాధ్యమని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.