సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోలు, వేశ్యగా చిత్రీకరించి...: వివాహితను బలితీసుకున్న ఆన్లైన్ లోన్ యాప్స్
అమరావతి : అవసరం లేకున్నా రుణాలిస్తామని వెంటపడతారు... వీరి మాయలో పడి డబ్బులు తీసుకున్నామో అంతే సంగతి.
అమరావతి : అవసరం లేకున్నా రుణాలిస్తామని వెంటపడతారు... వీరి మాయలో పడి డబ్బులు తీసుకున్నామో అంతే సంగతి. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ డబ్బులు కట్టడం కాస్త ఆలస్యమమైతే చాలు మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలా ఆన్ లైన్ రుణ సంస్థల లైంగిక వేధింపులను భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో చోటుచేసుకుంది. అసభ్యకర మెసేజ్ లు పంపిస్తూ వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నా ఆమె ఫోన్ కు అసభ్య మెసేజ్ లు ఆగడం లేదు. దీంతో మృతురాలి భర్త పోలీసులను ఆశ్రయించాడు. చినకాకాని హైలాండ్ రోడ్ లో నివాసముండే ప్రత్యూష (24) అవసరాల కోసం ఆన్ లైన్ లోనే రుణాలిచ్చే ఇండియన్ బుల్స్, రూపీ ఎక్స్ ఎమ్ నుండి కొంత డబ్బు తీసుకుంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా నిర్ణీత సమయానికి డబ్బులు చెల్లించలేకపోయింది. దీంతో రుణ సంస్థల వేధింపులు మొదలయ్యాయి. వివిధ మాధ్యమాల్లో ప్రత్యూష ఫోటో పెట్టి అసభ్యకర మెసేజ్ లతో దుష్ఫ్రచారం చేసేవారు. అంతటితో ఆగకుండా మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు, ఫోన్ నెంబర్ పెడతామని బెదిరించారు. ఈ వేధింపులు తట్టుకోలేక సెల్పీ వీడియో తీసుకుని ప్రత్యూహ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త రాజశేఖర్ పిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.