''పర్యావరణ పరిరక్షణపై తగ్గేదేలే... గణపయ్యతో పాటే ప్రకృతి సేవలో పుష్పరాజ్ ఎలుక..''
విశాఖపట్నం : పర్యావరణానికి హాని కల్గించకుండా ఈ వినాయకచవితిని మట్టి గణపతులు, సహజసిద్ద వస్తువులతో జరుపుకోవాలని అందరూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
విశాఖపట్నం : పర్యావరణానికి హాని కల్గించకుండా ఈ వినాయకచవితిని మట్టి గణపతులు, సహజసిద్ద వస్తువులతో జరుపుకోవాలని అందరూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. కానీ విశాఖపట్నంకు చెందిన యువ ఫౌండేషన్ మరో అడుగు ముందుకేసీ పర్యావరణానికి, ప్రకృతికి హాని కలిగించే చర్యలు మానుకోవాలంటూ గణపయ్య వాహనం మూషికంతో ప్రచారం చేయిస్తున్నారు. ఇలా గ్రీన్ గణేశా కాన్సెప్ట్ తో వినూత్నంగా నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్న యువ ఫౌండేషన్ ప్రకృతి, పర్యావరణ ప్రియులతో శభాష్ అనిపించుకుంటోంది.
ప్లాస్టిక్ వాడడం మానండి... మమ్మల్ని బ్రతికించండి అన్న ప్లకార్డ్ ఓ చేతిలో... గోనె సంచి మరోచేతిలో పట్టుకున్న మూషికం విగ్రహం ఆకట్టుకుంటోంది. ప్లాస్టిక్ బ్యాగులు మానేశాను తెలుసా?, మీరు మానేయడం మాత్రమే కాదు.. అందరికీ ప్లాస్టిక్ బ్యాగ్ లు మానేయమని చెప్పండి..., స్వచ్చ భారత్ కోసం విశాఖ నుంచి నేను రెడీ... మీరు కూడా స్వచ్చ భారత్ కోసం నాతో నడుస్తారు కదూ..., పర్యావరణ పరిరక్షణపై తగ్గేదేలే.. మీరూ అంతే కదా! అంటూ ఇలా వివిధ స్లోగన్స్ తో కూడిన మూషికాలు మట్టి గణపతి విగ్రహం చుట్టూ ఏర్పాటుచేసారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమవంతు ప్రయత్నంగా ఇలా వినూత్నంగా వినాయక మండపాన్ని ఏర్పాటుచేసినట్లు యువసేన ఫౌండేషన్ సభ్యులు పేలా హరిప్రసాద్ తెలిపారు.