అల్లూరి ఆత్మవిశ్వాసం, తెగువ, దేశభక్తి యువతకు ఆదర్శమవ్వాలి..: ఉపరాష్ట్రపతి వెంకయ్య
భారత స్వరాజ్య సంగ్రామం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.
భారత స్వరాజ్య సంగ్రామం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. భవిష్యత్ తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలన్న ఆకాంక్షతో నాటి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని... ముఖ్యంగా యువతరం నాటి స్వరాజ్య సమరయోధుల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఇదే వారికి అందించే నిజమైన నివాళి అని ఉపరాష్ట్రపతి తెలిపారు.
విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి మంగళవారం పాండ్రంగిలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని సందర్శించారు. అనంతరం బర్లపేటలో స్వాతంత్ర్య సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, రూపాకుల విశాలాక్షి విగ్రహాలను ఆవిష్కరించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మప్రదేశాన్ని సందర్శించిన సమయంలో తమ అనుభవాలను ఫేస్ బుక్ వేదికగా పంచుకున్న ఉపరాష్ట్రపతి... రూపాకుల దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసిన వారి చొరవను అభినందించారు.