మేం హ్యాపీగానే వున్నాం... రాజకీయం చేయొద్దు : జనసేన నేతలకు చేదు అనుభవం
గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన నేతలకు చేదు అనుభవం ఎదురైంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. మంగళగిరి పట్టణంలో ‘‘జగనన్న ఇల్లు - పేదల కన్నీళ్లు ’’ పేరిట జనసేన పార్టీ నేతలు మూడు రోజులు నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం టిడ్కో గృహాలను సందర్శించారు. అయితే ఆ సమయంలో అక్కడే వున్న లబ్ధిదారులు జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సంతోషంగా తమ గృహ ప్రవేశాలు చేశామని .. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సకల వసతులు కల్పించి తమ చేత గృహ ప్రవేశాలు చేయించారని వాస్తవాలు గమనించాలని చురకలు వేశారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.