Asianet News TeluguAsianet News Telugu

సలాం పోలీస్: అనాథ శవాన్ని మూడు కిలోమీటర్లు మోసిన పోలీసులు (వీడియో)

విధి నిర్వహణలోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటాం అని మరోసారి రుజువు చేశారు ఏపీ పోలీసులు. విశాఖ జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని సీత పాలెం సముద్ర తీరాన మూడు రోజులుగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించారు. 

విధి నిర్వహణలోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటాం అని మరోసారి రుజువు చేశారు ఏపీ పోలీసులు. విశాఖ జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని సీత పాలెం సముద్ర తీరాన మూడు రోజులుగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించారు.

వారిచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం అందించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆ శవాన్ని అక్కడినుండి తరలించాలని పోలీసులు ప్రయత్నించగా కుళ్ళిపోయి, దగ్గరకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న శవాన్ని తరలించడానికి  అక్కడి గ్రామస్తులు సైతం ముందుకు రాలేదు.

దీంతో రాంబిల్లి ఎస్సై అరుణ్ కిరణ్ మరియు ఎఎస్సై దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు మరియు హోంగార్డ్ కొండబాబులు ఆ మృత దేహాన్ని తమ భుజాలపై మోసుకు వచ్చి  ఎలమంచిలి మార్చురీకి తరలించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయి డిజిపి వరకు చేరాయి. దీంతో ఈ  పోలీస్ సిబ్బందికి డిజిపి ప్రశంసించారు. 

సేవాతత్పరతకు ప్రతీక ఏపీ పోలీసులు నిలుస్తున్నారని... అందుకు నిదర్శనంగా రాంబిల్లి ఘటన నిలిచిందన్నారు.  ఏపీ పోలీస్ శాఖ ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతున్న వారికి సలాం చేయకుండా ఉండలేకపోతున్నానని డిజిపి పేర్కొన్నారు. 

కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహన్ని మూడు కిలోమీటర్లు తమ భుజాలపై మోసుకుని తీసుకువచ్చి మానవత్వం చాటారన్నారు. రాంబిల్లి పోలీసులను యావత్ భారతం ప్రశంసలతో ముంచెత్తుతోందని... వారి సేవాతత్పరతకు జేజేలు పలుకుతోందన్నారు.

మానవత్వం మూర్తీభవించేలా పోలీసు ప్రతిష్ఠను ఇనుమడింప చేసిన రాంబిల్లి ఎస్సైతో పాటు పోలీసు సిబ్బందిని  ప్రత్యేకంగా అభినందించారు డిజిపి. శాంతి భద్రతల పర్యవేక్షణ మాత్రమే కాదు.... వరదలు అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణాలొడ్డి సేవలను అందించడంలోనూ పోలీసులు ముందున్నారన్నారు.

ముఖ్యంగా ఇటీవల కరోనా వచ్చిన తొలినాళ్ళలో  బంధువులు,  హితులు పట్టించుకోని సందర్భాలలో కూడా మానవత్వం చాటిచెప్పడంలోనూ తమదైన ముద్రను వేసుకుంటున్న ఏపీ పోలీసులకు సెల్యూట్ చేశారు డిజిపి సవాంగ్.