పురుగుల మందు పట్టుకుని... న్యాయం చేయాలంటూ ఆత్మహత్యకు సిద్దమైన జడ్జి తల్లి
విజయవాడ : అందరికీ న్యాయం చెప్పిన జడ్జి తల్లే తనకు అన్యాయం జరిగిందంటూ పురుగుల పట్టుకుని ఆత్మహత్యకు సిద్దమయ్యింది.
విజయవాడ : అందరికీ న్యాయం చెప్పిన జడ్జి తల్లే తనకు అన్యాయం జరిగిందంటూ పురుగుల పట్టుకుని ఆత్మహత్యకు సిద్దమయ్యింది. కొడుకు చనిపోయి పుట్టెడు ధు:ఖంలో వున్న ఆ తల్లికి అండగా వుండాల్సింది పోయి కొందరు నాయకులు ఆమె భూమి కబ్జాకు యత్నిస్తున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆ వృద్దురాలు తన పొలంలోనే ఆత్మహత్యకు సిద్దమయ్యంది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
జనసేన నాయకులు తెలిపిన వివరాల ప్రకారం... పెడనకు చెందిన పడమట వెంకటసుబ్బమ్మ అనే వృద్దురాలి కొడుకు తిరుమల రావు న్యాయమూర్తిగా పనిచేస్తూ అకాలమరణం చెందారు. దీంతో ఒంటరిగా మారిన వెంకటసుబ్బమ్మకు చెందిన విలువైన వ్యవసాయ భూమిపై మంత్రి జోగి రమేష్ అనుచరుడు పామర్తి సాంబశివరావు అలియాస్ డొకోమో సాంబ కన్నుపడింది. దిక్కులేని ఆ తల్లిని బెదిరించి ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఆ వృద్దురాలు భూమికోసం రెండేళ్ళుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి చావడానికి సిద్దమయ్యింది. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ చేతిలో పురుగుల మందుతో ఆమె వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాధిత మహిళకు పెడన జనసేన నాయకులు అండగా నిలిచారు.