ఇసుక మాఫియా చేతిలో యువకుడు బలి... గంగాధర నెల్లూరు ఘటనపై లోకేష్ సీరియస్
చిత్తూరు : ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక మాఫియా ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
చిత్తూరు : ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక మాఫియా ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్ర సహజ సంపద అయిన ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా యధేచ్చగా తోడుకుంటూ... ఎవరైనా తమ దందాకు అడ్డువస్తే చంపేసే స్థాయికి ఇసుక మాఫియా చేరుకుందన్నారు. ఇలా జగన్ రెడ్డి గారి ఇసుక మాఫియా అమాయకుల్ని బలి తీసుకుంటోందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు.
ఇసుక అక్రమ రవాణాకి అడ్డుపడ్డాడని దళిత యువకుడు వరప్రసాద్ కి శిరోముండనం ఘటన మరువకముందే తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్లపల్లెలో మరో దారుణం వెలుగుచూసిందని లోకేష్ అన్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నించి అడ్డుకోడానికి ప్రయత్నించిన యువకుడు కిషన్ ని ఇసుక మాఫియా హత్య చేసిందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి కిషన్ ని హత్య చేసిన ఇసుక మాఫియా, దాని వెనుక ఉన్న వైసిపి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని... బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేసారు.