ఎన్టీఆర్ జిల్లాలో దంచికొట్టిన వాన... ప్రమాదకరంగా ఉప్పొంగుతున్న వాగులు వంకలు
విజయవాడ : తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే భారీ వర్షాలతో ఇరు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతుంటే తాజాగా మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విజయవాడ : తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే భారీ వర్షాలతో ఇరు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతుంటే తాజాగా మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో గత రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులువంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా నందిగామ నియోజకవర్గ పరిధిలో ఈ వరద తీవ్రత ఎక్కువగా వుంది. కంచికచర్ల మండలంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీటమునిగాయి. ఇక నక్కలవాగు వరద నీటితో ఉప్పొంగడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీంతో పరిటాల సమీపంలోని ఈ వాగు పక్కనే వున్న అమృతసాయి కళాశాలకు సెలవు ప్రకటించారు. ఈ వాగు పంటపొలాలను ముంచెత్తింది. ఇక కంచికచర్ల మండలం చెవిటీకల్లు వద్ద లక్ష్మయ్య వాగు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు రోడ్డుపై నుండి ప్రమాదకరంగా పారుతుండటంతో చెవిటికల్లు - కంచికచర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కానీ అత్యవసర పనులపై వెళ్లేవారు ట్రాక్టర్లపై ప్రమాదకరంగా వరద నీటిని దాటుతున్నారు.