అమరావతిలో ఘోర అగ్నిప్రమాదం... రాజధాని నిర్మాణ సామాగ్రి కాలిబూడిద
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తుళ్లూరు మండలం నెక్కల్లు శివారులో రాజధాని నిర్మాణ సామాగ్రి మంటల్లో కాలిబూడిదవుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం తీసుకువచ్చిన భారీగా ప్లాస్టిక్ పైపులు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా పడివున్నాయి. దీంతో వాటిలో తేనెతీగలు తుట్టెలు ఏర్పాటుచేసారు. ఈ తేనె కోసం గుర్తుతెలియని వ్యక్తులు మంటరాజేసి పొగబెట్టారు. ఈ మంటలు కాస్తా పైపులకు అంటుకోవడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణ సామాగ్రి భారీగా కాలిబూడిద కావడంతో ఆస్తి నష్టం ఎక్కువే వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని అధికారులు తెలిపారు.