కర్మకాండలు చేస్తూ నదిలో చిక్కుకున్న కుటుంబసభ్యులు... తాళ్ల సహాయంతో కాపాడిన గ్రామస్థులు..!
ఒక్కసారిగా మున్నేరులో వరద ఉధృతి పెరగటంతో కర్మకాండలు చేస్తున్న కుటుంబ సభ్యులు మున్నేరులో చిక్కుకున్న ఘటన జగ్గయ్యపేట పరిధిలో జరిగింది.
ఒక్కసారిగా మున్నేరులో వరద ఉధృతి పెరగటంతో కర్మకాండలు చేస్తున్న కుటుంబ సభ్యులు మున్నేరులో చిక్కుకున్న ఘటన జగ్గయ్యపేట పరిధిలో జరిగింది. వారిని అతికష్టం మీద గ్రామస్థులు కాపాడగలిగారు. వివరాల్లోకి వెళితే ... పెనుగంచిప్రోలుకు చెందిన చాగంటి.దైవదీనం అను వ్యక్తి గత రెండు రోజుల క్రితం మృతిచెందాడు. ఈ మేరకు శనివారం మృతుని చిన్నకర్మ చేసేందుకు కుటుంబ సభ్యులు మున్నేరు వద్దకు వచ్చారు. అప్పటికే ఏటిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఏటి మధ్యలో ఉన్న ఇసుక దిబ్బపై కర్మకాండలు చేసేందుకు కుటుంబ సభ్యులు, పూజారి అంతా కలిసి ట్రాక్టర్ పై ఇసుక దిబ్బ మీదకు చేరారు. కర్మ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారంతా అదే ట్రాక్టర్ పై ఎక్కి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఏటిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ట్రాక్టర్ మునిగిపోయేంత నీరు చుట్టూ చేరటంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న వారంతా ప్రాణ భయంతో కేకలు వేశారు. వంతెనపై ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు, గ్రామస్తులు గమనించి వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. బలమైన తాళ్ల సాయంతో అతి కష్టం పైన ట్రాక్టర్ పై ఉన్న ఐదుగురిని వంతెన పైకి చేర్చారు. ట్రాక్టర్కు తాళ్లు కట్టి నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా పట్టుకున్నారు. ఈలోగా జెసిబి తీసుకువచ్చి దాన్ని నదిలోకి దింపి ట్రాక్టర్ను బయటకు తీసుకువచ్చారు.