సీఎం జగన్ ఫోటో చింపిన కుక్క పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన టీడీపీ మహిళా నేతలు
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఏపీలోని అధికార వైసిపితో పాటు ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళుతున్నాయి.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఏపీలోని అధికార వైసిపితో పాటు ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళుతున్నాయి. ఇప్పటికే వైసిపి గడపగడపకు కార్యక్రమంతో ప్రజాప్రతినిధులను ప్రజల్లోకి పంపిన జగన్ తాజాగా 'మా నమ్మకం నువ్వే జగనన్న' కార్యక్రమం ద్వారా వైసిపి నాయకులు, కార్యకర్తలను రంగంలోకి దింపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుని జగన్ ఫోటోతో కూడిన స్టిక్కర్ ఆ ఇంటికి గృహసారధుల పేరిట ఎంపికచేసిన వైసిపి నాయకులు అతికిస్తున్నారు. అయితే ఇలా ఓ గోడకు అతికించిన జగన్ స్టిక్కర్ ను ఓ కుక్క నోటితో కరిచి తొలగించడం రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి జగన్ స్టిక్కర్ ను తొలగించిన కుక్కపై కేసులు పెట్టాలంటూ ప్రతిపక్ష టిడిపి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళలు ఓ అడుగు ముందుకేసి స్టిక్కర్ చించేసి సీఎం జగన్ ను అవమానించిన కుక్కను జైల్లో పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించారు. గౌరవ సీఎంను ఎవరు అవమానించినా ఊరుకోవద్దని... అది మనుషులైనా, జంతువులైనా...! అంటూ తెలుగు మహిళలు సెటైరికల్ కామెంట్స్ చేసారు