తిరుపతి: చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకుని ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి పట్టణంలోని  లీలామహల్ స్మశానవాటిక వద్ద అతడు ఈ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ శబ్దం వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ పోలీసులు రక్తపుమడుగులో పడివున్న మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రూయా హాస్పిటల్ కు తరలించారు. భార్యాభర్తల గొడవ వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. 

మృతుడు కె.వి పల్లి మండలం గర్నిమిట్ట గ్రామం కొండారెడ్డి గారి పల్లి కి చెందిన సిద్ధరాముగా పోలీసులు గుర్తించారు. అతడు 4 నెలల క్రితం బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగిగా పదవి విరమణ పొందాడు. ప్రస్తుతం సుందరయ్య నగర్ లో కుటుంబంతో  కలిసి నివసిస్తున్నాడు. 

ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబకలహాల వల్లే చనిపోయాడా లేకా మరేదైనా కారణం వుందా అన్నదానిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.