పెళ్లై, పిల్లలున్న ఓ మహిళ మరో వ్యక్తి మోజులో పడి ఇంట్లోనుండి పారిపోయింది. చివరికి ఆ వ్యక్తి హ్యాండ్ ఇవ్వడంతో ఇంటికి తిరిగి రాలేక, తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకన్న విషాద ఘటన తిరుపతిలో జరిగింది. 

ఈస్ట్‌ ఎస్‌ఐ జయచంద్ర కథనం...శ్రీకాళహస్తికి చెందిన సురేష్‌ కూతురు చెంచమ్మ (27)కు పాపానాయుడుపేటకు చెందిన వ్యక్తితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే చెంచమ్మ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి ఆమె భర్త, తల్లిదండ్రులు ఎన్నోసార్లు మందలించారు. అయినా ఆమె తీరు మారలేదు. ఈ నేపథ్యంలో చెంచమ్మ గత నెల 11న తన ప్రియుడితో కలిసి పారిపోయింది.  

ఎక్కడెక్కడ తిరిగారో, ఏమయిందో తెలియదు కానీ ఈ నెల ఒకటిన మళ్లీ వారిద్దరూ తిరుపతికి తిరిగి వచ్చారు. ఆమె ప్రియుడు చెంచమ్మను వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. చెంచమ్మకు ఇంటికి వెళ్లడానికి మొహం చెల్లలేదు. దీంతో తండ్రికి ఫోన్ చేసి..

‘‘నాయనా! తప్పు చేసినాను..మళ్లీ ఇంటికి రావాలంటే ఏదోలా ఉంది..నన్నెవరూ క్షమించరు..పిలకాయలతో ఓసారి మాట్లాడించు నాయనా..మీకు నా ముఖం చూపలేక సచ్చిపోతున్నాను’’ అని ఫోన్‌లో చెప్పి ఆత్మహత్యకు యత్నించింది. 

గురువారం రోజు సాయంత్రం  స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి తండ్రికి ఫోన్‌ చేసింది. తన పిల్లలతో ఒకసారి మాట్లాడించాలని కోరింది. తాను విషం తాగానని, చనిపోతున్నానని చెప్పి ఉన్నఫళాన పడిపోయింది. 

స్థానికులు గమనించి 108లో ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చెందిన ఆమె తండ్రి తిరిగి ఫోన్‌ చేయడంతో స్థానికులు జరిగిన విషయాన్ని తెలిపారు. రుయా ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చెంచమ్మ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.