కొందరు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు... మరి కొందరు నాజుకుగా ఉంటే బాగుంటారు... అయితే... హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోసి భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాత్రం  ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది. ఒకాకొనక సమయంలో బాగా బరువు పెరిగిన సానియా... మళ్లీ ఫిట్ గా మారిపోయారు. 

గతంలో చాలా ఫిట్ నెస్ తో ఉండే ఆమె...  ఓ బాబుకి తల్లి అయిన తర్వాత కాస్త ఒళ్లు చేశారు. దాదాపు 89 కిలోలకు ఆమె బరువు పెరిగారు.ఆ బాబుకి ఈ మధ్యనే మొదటి పుట్టిన రోజు కూడా పూర్తయ్యింది. ఆ తర్వాతే సానియా మళ్లీ తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టారు.  తిరిగి టెన్నిస్ రాకెట్ చేతపట్టేందుకు రంగంలోకి దిగిన సానియా ముందుగా తన బరువుపై దృష్టి పెట్టారు. ఫిట్ గా మారేందుకు కఠోర శ్రమ చేశారు. కేవలం 4 నెలల కాలంలో 26కిలోల  బరువు తగ్గి మళ్లీ ఫిట్ గా మారిపోయారు.

 

తాజాగా తన ఫిట్‌నెస్‌కు సంబంధించి సానియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ప్రతి ఒక్కరికీ లక్ష్యాలు ఉంటాయని పేర్కొన్న సానియా.. వాటిని గర్వకారణంగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. మన కలలను సాకారం చేసేందుకు యత్నిస్తుంటే ఎంతో మంది నిరాశకు గురిచేస్తారని.. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

Also Read గ్రాండ్ గా సానియా సెకండ్ ఇన్నింగ్స్....విజయం తరువాత కొడుకు ఫొటోతో ట్వీట్ వైరల్...

‘89 కిలోలు వర్సెస్‌ 63 కిలోలు. ప్రతి ఒక్కరికి లక్ష్యాలు ఉంటాయి. రోజువారి లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏవైనా..  ప్రతిదానిని గర్వకారణంలా నిలిపేందుకు శ్రమించాలి. తల్లి అయ్యాక తిరిగి ఫిట్‌గా, ఆరోగ్యంగా కావాలనే నా లక్ష్యాన్ని సాధించడానికి 4 నెలల సమయం పట్టింది. తిరిగి ఫిట్‌నెస్‌ పొందడానికి, అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి ఎంతో సమయం పట్టిందని అనిపిస్తోంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని నిరాశకు గురిచేసేవారు ఎంతో మంది ఉంటారు. కానీ నేను ఇది చేయగలను అనుకుంటే దానిని తప్పకుండా సాధిస్తారు’ అని సానియా పేర్కొన్నారు.

కాగా సానియా పెట్టిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోకీ, ఈ ఫోటోకీ మధ్య ఉన్న వ్యత్సాసం చాలా స్పష్టంగా కనపడుతుంది. అంత బరువు తగ్గడానికి ఆమె పడిన కష్టం కూడా ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఆమె కష్టానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. పాజిటివ్ గా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.