హైదరాబాద్: సంపన్న కుటుంబాలకు చెందిన యువకులే ఆ కిలాడీలేడీ టార్గెట్. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి యువకుల వివరాలను సేకరించి వారితో పరిచయం పెంచుకుటుంది. ఇలా మెల్లిగా ముగ్గులోకి దించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేస్తుంది. ఇలా మహిళ చేతిలో మోసపోయిన యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. 

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది మహిళ. ఈ క్రమంలో అతడికి వీడియో కాల్ చేస్తూ రెచ్చగొట్టేది. ఈ క్రమంలోనే ఆమె కోరిక మేరకు న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడాడు యువకుడు. ఈ వీడియోను రికార్డ్ చేసిన సదరు మహిళ తన అసలు రూపాన్ని బయటపెట్టింది.  

ఈ న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ యువకుడిని బెదిరించడం ప్రారంభించింది కిలాడీ. అలా చేయకుండా వుండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఇప్పటికే రూ.22వేలను ఆమెకు సమర్పించుకున్నాడు. అయితే మరోసారి లక్ష రూపాయలు కావాలంటూ సదరు మహిళ డిమాండ్ చేయడంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.