హైదరాబాద్: యువతి పేరుతో సోషల్ మీడియా అకౌంట్ తెరిచి బంధువుల అమ్మాయితో స్నేహాన్ని పెంచుకున్న ఓ యువకుడు లైంగిక వేధింపులకు దిగాడు. నగ్న వీడియోలు పంపాలంటూ, నగ్నంగా చాట్ చేయాలని వేధించడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించగా అసలు నిజం బయటపడింది. నిందితున్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని రజకబజార్‌కు చెందిన పామర్తి సోమేంద్ర సాయి(25)ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో నివాసముంటున్నాడు. అయితే సోషల్ మీడియాలో బంధువుల అమ్మాయి ప్రొపైల్ కనిపించడంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా ఆమె అంగీకరించింది. దీన్ని అదునుగా తీసుకున్న అతడు సదరు యువతిపై కన్నేశాడు. 

ఓ యువతి ఫోటో, వివరాలతో నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన సోమేంద్ర బంధువుల అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. దీన్ని కూడా సదరు యువతి ఓకే చేసింది. అప్పటినుండి అమ్మాయికి వేధింపులు ఆరంభమయ్యాయి. తనతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలని, నగ్న చిత్రాలను పంపించాలని వేధించడం ప్రారంభించాడు. ఇలా కొంత కాలంగా వేధింపులను భరించిన యువతి ఇక భరించలేక పోలీసులను ఆశ్రయించింది. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితున్ని గుర్తించారు. అతడి ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేశారు.  ఇంతకాలం యువతి పేరుతో తనను వేదిస్తున్నది బంధువుల అబ్బాయి సోమేంద్ర అని తెలిసి యువతి అవాక్కయ్యింది.