హైదరాబాద్: ఓ మహిళ తన భర్తను చంపేసి పోలీసులకు లొంగిపోయింది. తనను రోజూ వేధిస్తుండడంతో భరించలేక 31 ఏళ్ల మహిళ భర్తను హత్య చేసిన సంఘటన హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో జరిగింది.

రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత భర్త నిద్రపోయాడు. నిద్రిస్తున్న భర్తను మహిళ చంపేసి మంగళవారం ఉదయం పోలీసులకు లొంగిపోయింది. 

జగద్గిరిగుట్టలోని రవినారాయణ రెడ్డి నగర్ లోని కైరున్నీసా తన భర్త సఫుద్దీన్ ను ఇనుప రాడ్ తో తలపై బలంగా కొట్టి చంపింది.  సఫుద్దీన్ మద్యానికి బానిసయ్యాడు. గత కొన్నేళ్లుగా రోజూ తాగి వస్తూ భార్యను వేధిస్తూ వస్తున్నాడు. 

సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత మర్నాడు ఉదయం ఒంటి గంట ప్రాంతంలో ఇరువురు గొడవ పడ్డారు. వ్యభిచారం చేసైనా సరే డబ్బు తీసుకుని రావాలని వేధించాడు. దానికి ఆమె నిరాకరించడంతో కొట్టాడు. 

అతని వేధింపులను భరించలేక కైరునిషా ఇనుప రాడ్ తీసుకుని అతను నిద్రిస్తున్న సమయంలో బలంగా కొట్టి చంపింది. ఐరన్ రాడ్ ను దాచేసి తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.