అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన బోరబండ కార్పోరేటర్ బాబా పసియుద్దిన్ సహాయకుడొకరు పోీలీస్ అధికారి ఇంట్లో పనిచేసే మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 

హైదరాబాద్: ఓ పోలీస్ ఉన్నతాధికారి ఇంట్లో పనిచేసే మహిళతో అధికారపార్టీ (TRS) నాయకుడి సహాయకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో వెలుగుచూసింది. పట్టపగలే నడిరోడ్డుపై మహిళను ఆకతాయి చేష్టలతో వేధిస్తుండగా గమనించిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సదరు ఆకతాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మహిళను కాపాడారు. 

బాధిత మహిళ, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ బోరబండ రాయల్ పంక్షన్ హాల్ సమీపంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి కుటుంబం నివాసముంటోంది. ఈ ఇంట్లో ఓ మహిళ పని చేస్తోంది. అయితే శనివారం పోలీస్ అధికారి ఇంట్లో పనులు ముగించుకున్న మహిళ బయటకు వచ్చింది. 

ఇదే సమయంలో బోరబండ కార్పోరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా పసియుద్దిన్ అనుచరుడు షేక్ ఖలీల్ (21) పనిపై కూకట్ పల్లికి వెళ్లి బోరబండకు తిరిగివస్తున్నాడు. రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న మహిళను గమనించిన అతడు ద్విచక్రవాహనంపైనే మెళ్లిగా ఆమెను వెంబడించసాగాడు. ఈ క్రమంలోనే ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా వేధించాడు. అందుకు ఆమె నిరాకరించినా వదిలిపెట్టకుండా వెంటపడుతూ వేధించాడు. 

ఎక్కువగా జనాలు లేని ప్రాంతంలో సదరు మహిళపై రెచ్చిపోయాడు ఖలీల్. అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దౌర్జన్యానికి దిగాడు. అతడి వికృత చేష్టలను భరించలేక మహిళ అరిచి కేకలు పెట్టింది. దీంతో మహిళ పరిస్థితిని అర్థం చేసుకున్న స్థానికులు కొందరు డయల్ 100కు ఫోన్ చేసారు. 

వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మహిళను వేధిస్తున్న యువకుడు ఖలీల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించి వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కటకటాలవెనక్కి తోసారు. అతడు మహిళను వేధిస్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయినట్లు... వాటిని స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళను వేధించిన అతడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.