హైద్రాబాద్ నానక్రామ్గూడలో మహిళపై రేప్, హత్య: పోలీసుల దర్యాప్తు
హైద్రాబాద్ నగరంలోని నానక్ రామ్ గూడలో నిర్మాణంలో ఉన్న భవనంలో మహిళ డెడ్ బాడీ కలకలం రేపుతుంది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్:నగరంలోని నానక్రామ్ గూడలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ మహిళ మృతదేహన్ని కుళ్లిన స్థితిలో మంగళవారంనాడు లభ్యమైంది. మహిళపై అత్యాచారం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం చేసిన తర్వాత మహిళను హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజులుగా మహిళ అదృశ్యమైంది. ఇవాళ ఆమె మృతదేహం లభ్యమైంది.
హైద్రాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని నానక్ రామ్ గూడలో నిర్మాణంలో ఉన్న భవనంలో మహిళ హత్యకు గురైంది. మృతురాలు కాశమ్మగా పోలీసులు గుర్తించారు. ఆమె తన కూతురు వద్ద ఉంటుంది. అయితే కూతురుతో గొడవ పెట్టుకొని ఆమె ఇంటినుండి వెళ్లిపోయింది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఆమె మృతదేహంగా కన్పించడంపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మహిళను ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మహిళను మూడు రోజుల క్రితం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డెడ్ బాడీపై దుస్తులు లేవు. దీంతో హత్య చేయడానికి ముందు బాధితురాలిపై అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహిళను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ పుటేజీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.