అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వనందుకు ఓ యువతి వాచ్‌మెన్‌ను చితక్కొట్టింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ చందానగర్‌లోని సిరి అపార్ట్‌మెంట్‌కు ఓ మహిళ కారులో వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది.

అయితే అనుమతి లేకుండా అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లకూడదంటూ వాచ్‌మేన్ ఆమెను అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ కారు దిగి వచ్చి మరి వాచ్‌మేన్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది.

నన్నే ఆపుతావా అంటూ పిడిగుద్దులు కురిపించడమే కాక కాలితో తన్నింది. అక్కడితో ఆగకుండా చెప్పు తీసి ఇష్టమొచ్చినట్లు కొట్టింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడు  చందానగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.