హైదరాబాద్: హైదరాబాదు కేంద్రంగా లక్షలాది మంది నిరుద్యోగులకు టోకరా ఇచ్చిన సంస్థ గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న విజ్డమ్ జాబ్స్ పోర్టల్ సీఇవో అజయ్ కొల్లాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

విజ్డమ్ పోర్టల్ రూ. 100 కోట్లకుపైగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ బాధితులు మన దేశంలోనే లక్షల మంది ఉన్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను ఈ సంస్థ మోసం చేసినట్లు గుర్తించారు. 

తమకు పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలున్నాయని, దాంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ సంస్థ నమ్మబలికినట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు 3 కోట్ల మంది రిజష్టర్డ్ యూజర్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

సంస్థకు చెందిన కంప్యూటర్లను, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నిపుణులు, దర్యాప్తు అధికారులతో 10 బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.