హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ నటులకు క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ కేసులో మరికొన్ని చార్జీషీట్లు దాఖలు చేస్తామని తేల్చి చెప్పింది.

డ్రగ్స్ కేసులో  ఎక్సైజ్ సిట్ దాఖలు చేసిన  చార్జీషీట్లపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభయ్య అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దాఖలు చేసిన చార్జీషీట్లలో సినీ ప్రముఖుల పేర్లు పేర్కొనలేదు.దీంతో ఈ విషయమై తీవ్రమైన విమర్శలను ఎక్సైజ్ శాఖ మూటగట్టుకొంది.

ఈ తరుణంలో ఎక్సైజ్ శాఖ బుధవారం నాడు వివరణ ఇచ్చింది. తమపై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడింది.

డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏడు చార్జీషీట్లు దాఖలు చేసినట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మరో ఐదు చార్జీషీట్లు దాఖలు చేయనున్నట్టు సిట్ అధికారులు ప్రకటించారు. సినీ ప్రముఖులకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదని తేల్చి చెప్పింది.

సినీ ప్రముఖుల నుండి సేకరించిన శాంపిళ్లకు సంబంధించిన ఎవిడెన్స్‌ను పోరెన్సిక్ నుండి వచ్చిందని సిట్ ప్రకటించింది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారెవరినీ కూడ తాము  వదలబోమని కూడ  సిట్ తెలిపింది.ఇప్పటివరకు దాఖలు చేసిన చార్జీషీట్లలో సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంపై  విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

తెలుగు సినీ రంగాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసు: వాళ్లు బాధితులే

హైద్రాబాద్ డ్రగ్స్‌కేసు: సినీ ప్రముఖులకు క్లీన్ చిట్