హైదరాబాద్: .జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా మారింది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు నేతలు బూతులు తిట్టుకొన్నారు. దీంతో వారిద్దరిని వారించేందుకు ఇతర నేతలు కష్టపడ్డారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు గాంధీ భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, నిరంజన్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకొంది.నియోజకవర్గ పరిధిలో ఏం ప్లాన్ చేశారో చెప్పాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. స్ట్రాటజీ ప్లాన్ చేయాలని ఆయన హైద్రాబాద్ నేతలకు సూచించారు.ఈ సమయంలో పీసీసీ చీఫ్ ఏం చెబుతున్నాడో వినాలని నిరంజన్ దాసోజ్ శ్రవణ్ కుమార్ కు సూచించారు.

అయితే మధ్యలో నీవు ఎందుకు మాట్లాడుతున్నావని నిరంజన్ ను ఉద్దేశించి దాసోజ్ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకొంది. ఇద్దరు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు.  ఒకరిపై మరొకరు బూతులు తిట్టుకొన్నారు. వీరిని అదుపు చేసేందుకుగాను ఇతర నేతలు కష్టపడ్డారు.

వీరిద్దరి మధ్య గొడవలపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేసుకొన్నారు.పార్టీలో పద్దతి, ప్రోటోకాల్ లేదని ఆయన మండిపడ్డారు.