కరీంనగర్:  కరీంనగర్‌ జిల్లా కాకతీయ కాలువలో కారులో సజీవ సమాధి అయిన మెడికల్ స్టూడెంట్ వినయ్ శ్రీ తన పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందే మృతి చెందింది. పుట్టిన రోజున తన స్నేహితులు ఆమె సెల్‌పోన్‌కు మేసేజ్‌లు పెట్టారు. కానీ ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని క్లాస్‌మేట్స్‌ గుర్తు చేసుకొంటున్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక ఆమె భర్త సత్యనారాయణరెడ్డి, కూతురు వినయ శ్రీలు కాకతీయ కాలువలో కారులో జల సమాధి అయ్యారు. కాలువలో ఉన్న కారులో ఈ ముగ్గురి మృతదేహాలను ఈ నెల 17వ తేదీన పోలీసులు బయటకు తీశారు.

వినయశ్రీ  నిజామాబాద్‌లో ఉన్న మేఘన డెంటల్ కాలేజీలో చదువుతోంది. మరో ఆరు మాసాల్లో ఆమె కోర్సు పూర్తి కానుంది. ఈ తరుణంలోనే ఆమె ఇలా మృత్యువాత పడడంతో ఆమె క్లాస్‌మేట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Also read:సోదరి రాధిక ఫ్యామిలీ మృతి: అదృశ్యంపై ఎమ్మెల్యేకు ముందే తెలిసినా... అనుమానాలు

ఈ నెల 16వ తేదీన వినయశ్రీ పుట్టిన రోజు.   ఈ ఏడాది  జనవరి 25వ తేదీన వినయశ్రీ కాలేజీ నుండి కరీంనగర్‌ జిల్లాలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. జనవరి 26వ తేదీన కొందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసిన సమయంలో తల్లి దండ్రులతో కలిసి టూరుకు వెళ్తున్నట్టుగా ఆమె చెప్పింది.  ఈ విషయాన్ని మేఘన డెంటల్ కాలేజీ విద్యార్థులు గుర్తు చేసుకొన్నారు.

టూరు నుండి వచ్చిన తర్వాత కాలేజీకి వస్తానని తమతో చెప్పినట్టుగా కొందరు ఫ్రెండ్స్ ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినయశ్రీతో తమకు ఉన్న  అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు.

ఈ నెల 16వ తేదీన వినయశ్రీ పుట్టిన రోజు. అయితే ఆమెకు చాలా మంది ఫ్రెండ్స్ గ్రీటింగ్స్ పంపారు. కానీ ఆమె నుండి ఎలాంటి స్పందన రాలేదు. కొందరు ఫ్రెండ్స్ కూడ ఆమె కోసం ఫోన్లు చేశారు. టూరుకు వెళ్లినందున ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం కానీ, ఫోన్ ఛార్జింగ్ లేదని స్నేహితులు భావించారు.  

కానీ కారులోనే తల్లిదండ్రులతో వినయశ్రీ జల సమాధి అయిందని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.కాలేజీలో వినయ్ శ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె స్నేహితులు నివాళులర్పించారు.

కాలేజీలో చదువుతో పాటు  ఆటపాటల్లో కూడ వినయశ్రీ ముందుండేదని ఆమె స్నేహితులు గుర్తు  చేసుకొంటున్నారు. టూరుకు వెళ్లిన వినయశ్రీ తమకు ఇక కన్పించకుండా పోతోందని అనుకోలేదని స్నేహితులు విలపిస్తున్నారు.