మోత్కూరు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోత్కూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారు  గురువారం నాడు ధర్నాకు దిగారు. మహిళలు తమ మెడలోని మంగళసూత్రాలు, పురుషులు ఉంగరాలను లంచంగా ఇస్తామని రెవిన్యూ అధికారులకు చెప్పారు. తమ సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.

మోత్కూరు పట్టణంలోని మూడు ఎకరాల 18 గుంటల భూమిని వడ్డెర సామాజిక వర్గానికి  ప్రభుత్వం కేటాయించింది.  ఈ మూడు ఎకరాల 18 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 

రెండు ఎకరాల 18 గుంటల భూమిలో ఇండ్లు నిర్మించుకొన్నారు. మరో ఎకరం 20 గుంటల భూమిని అధికార పార్టీకి చెందిన నేతలు ఆక్రమించుకొన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.  ఈ విషయమై 2016 నుండి ఇప్పటివరకు రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగినా కూడ ఫలితం లేకుండా పోయిందని బాధితులు  చెబుతున్నారు.

ఇతరుల కబ్జాలో ఉన్న ఎకరం 20 గుంటల భూమిని తమకు ఇప్పించాలని  వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారు మోత్కూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

కార్యాలయంలోకి తహాసీల్దార్ సహా ఇతరులను  వెళ్లకుండా అడ్డుకొన్నారు. మహిళలు తమ మెడలోని మంగళసూత్రాలు, పురుషులు తమ చేతికి ఉన్న ఉంగరాలు, సెల్‌పోన్లను జోలె పట్టి సేకరించారు. లంచం ఇచ్చుకోలేం.. వీటిని తీసుకొని  తమ సమస్యను పరిష్కరించాలని వారు ఎమ్మార్వోను కోరారు.

 ఇదే జిల్లాలో గతంలో యాదగిరిగుట్ట ఎమ్మార్వో కార్యాలయంలో లంచం తీసుకొని తన పని చేయకుండా తిప్పుతున్న ఓ రెవిన్యూ అధికారిపై ఒకరు తిరగబడ్డారు.  తన వద్ద నుండి తీసుకొన్న డబ్బులను తనకు ఇచ్చేయాలని  డిమాండ్ చేశారు.