Amnesia Pub Rape Case : పథకం ప్రకారమే బాధితురాలి ట్రాప్.. ట్యాగ్ తెంచేసి, ఫోన్ లాక్కుని...
అమ్నీషియా పబ్ రేప్ కేసులో బాధితురాలిని నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే ట్రాప్ చేశారని పోలీసుల నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పబ్ లోకి వెళ్లేందుకు ఉన్న ట్యాగ్ ను చింపేసి.. ఆమెను తిరిగి పబ్ లోకి వెళ్లకుండా చేశారు.
హైదరాబాద్ : ‘జూబ్లీహిల్స్ లో Amnesia Pub కు స్నేహితులతో కలిసి వెళ్లిన బాలికపై gang rape చేసిన నిందితులు.. అంతకు ముందు ఆమె వస్తువులు లాక్కుని.. పథకం ప్రకారం దిగ్బంధించారు. పబ్ లోపలికి వెళ్లేందుకు వీలుగా యాజమాన్యం ఇచ్చిన tagలు ఆమెకు తెలియకుండా తెంచేశారు. ఆమె మళ్లీ pub లోకి వెళ్లలేని పరిస్థితి కల్పించారు. ఆమెను ఇంటి దగ్గర దింపుతామంటూ బెంజ్ కారులో ఎక్కించుకున్నారు’.. జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలు పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. మే 28న అత్యాచార ఘటన తర్వాత జూన్ 2న భరోసా కేంద్రంలో బాధితురాలితో ఓ మహిళా పోలీస్ అధికారి మాట్లాడారు. ‘నాకు నిందితులెవరూ పరిచయం లేరు. నా స్నేహితురాలు ఇంటికి వెళ్తాను అంటే మేము ఇద్దరం బయటకు వచ్చాం. ఆమె క్యాబ్లో వెళ్ళిపోయింది. మాతో పాటు నలుగురు నిందితులు వచ్చారని’ బాధితురాలు చెప్పినట్లు తెలిసింది.
క్యాబ్ బుక్ చేస్తామని నటిస్తూ…
మే 28, సాయంత్రం పబ్ నుంచి బయటికి వచ్చిన బాలిక ఇంటికి వెళ్లేందుకు.. పబ్ లో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతడు సమాధానం ఇవ్వలేదు. పక్కనే ఉన్న నిందితులు క్యాబ్ బుక్ చేస్తామంటూ ఆమె ఫోన్ లాక్కున్నారు. మొబైల్ డేటా సరిగా లేదు.. మేము దింపుతాం అంటూ బెంజ్ కారులో ఆమెను ఎక్కించుకున్నారు. నిందితుల్లో ఒకరు ఆమె బ్యాగ్ కళ్ళజోడు తీసుకున్నాడు. బంజారాహిల్స్ వైపు కారులో వెళ్తుండగానే.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. కాన్సు బేకరీ వద్దకు వచ్చాక… ఈ కారు ఇరుకుగా ఉందని, మరో కారు వస్తుందని చెప్పారు. తన ఫోన్, కళ్ళజోడు, బ్యాగ్ ఇస్తే ఇంటికి వెళ్ళిపోతాను అని ఆమె బతిమాలినా వినలేదు. బెదిరించి మరో కారులో తీసుకువెళ్లారు.
చిరునామా తెలియక… వస్తువులు దొరకక…
‘బేకరీ వద్ద ఇన్నోవాలో ఎక్కేందుకు 15 నిమిషాల వ్యవధి ఉంది. ఆ సమయంలో బయటికి వచ్చి ఎవరినైనా సహాయం అడగవచ్చు. ఎవరికైనా చెప్పి పోలీసులకు ఫోన్ చేయించవచ్చు కదా’ అని ఆ అధికారిని బాలిక వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అది తనకు తెలియని ప్రాంతం కావడంతో ఏమి చేయలేక పోయానని బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. పైగా తన కళ్ళజోడు, ఫోను, బ్యాగ్ తిరిగి ఇవ్వకపోవడంతో వాటికోసమే తాను కారులోనే ఉన్నానని వివరించినట్లు సమాచారం.
కారు నడిపింది ఎవరు?
పబ్ నుంచి బంజారాహిల్స్ కాన్సు బేకరీ వరకు బెంజ్ కారును.. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో చివరిగా పట్టుబడిన మైనర్ (16) నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కారు నడిపిన అతడి మీద, కారు ఇచ్చిన కుటుంబసభ్యులపైన కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కారు ఆ బాలుడు తల్లి పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు. బేకరీ నుంచి వెళ్లే సమయంలో ఇన్నోవా కారును ప్రభుత్వరంగ సంస్థ చైర్మన్ కుమారుడు నడిపినట్లు అనుమానిస్తున్నారు. సనత్ నగర్ కు చెందిన ఒక మహిళ పేరిట 2019లో కొన్ని ఇన్నోవా మూడేళ్లుగా తాత్కాలిక (టీఆర్) నెంబర్ తోనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ ఆ పదవిలోకి రాకముందే ఈ కారును వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాత దాన్నే ‘ప్రభుత్వ వాహనం’ స్టిక్కర్లు అతికించి వాడుతున్నట్లు సమాచారం.
నాలుగు రోజుల కస్టడీకి సాదుద్దీన్…
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పుప్పాలగూడ కు చెందిన సాదుద్దీన్ మాలిక్ (18)ను ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. మిగిలిన ఐదుగురు మైనర్ల కస్టడీ కోరుతూ మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మైనర్ల కుటుంబ సభ్యులు బుధవారం జువైనల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.