కరీంనగర్ లో కారు ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగర శివారులోని అలుగునూరు వద్ద కాకతీయ కాలువలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారులో కుళ్లిన స్థితిలో మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 15 రోజుల క్రితం కాలువలో పడి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేర కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా... కారులో లభ్యమైన ఆ మూడు మృతదేహాలు ఎవరివో పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ సొంత చెల్లి రాధికగా గుర్తించారు. 

తొలుత కారులో రెండు మృతదేహాలు మాత్రమే ఉన్నాయని అనుకున్నారు. తీరా చూస్తే.. మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సత్యానారాయణ రెడ్డి, సహస్ర, రాధికలుగా గుర్తించారు. రాధిక ఎమ్మెల్యే సోదరి కాగా... సత్యనారాయణ రెడ్డి ఆమె భర్త, సహస్ర వారి కుమార్తె.  ముగ్గురి మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోవడం గమనార్హం. వీరంతా గత 20 రోజులుగా కనిపించకుండా పోయారు. తీరా ఈ రోజు ఇలా కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

కాగా... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే... వారు 20 రోజులుగా కనిపించకుండా పోయినా.. కనీసం ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ప్రమాదమే జరిగిందా..? మరింకేదైనా కారణముందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబసభ్యులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కుటుంబసభ్యులను సైతం ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. తన  సోదరి కుటుంబం తరచూ విహార యాత్రలకు వెళుతూ ఉంటారని చెప్పారు. ఇలాంటి దుర్వార్త వింటామని ఊహించలేదని ఆయన వాపోయారు.

Also Read అలుగునూరు బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: గాయపడిన కానిస్టేబుల్ మృతి...

ఇదిలా ఉండగా... ఈ కెనాల్ కి సమీపంలోనే ఆదివారం జంట ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. లారీ ఢీకొని మానేరు వంతెన పై నుంచి కారు బోల్తా పడటంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. సాయం చేసేందుకు వచ్చిన కానిస్టేబుల్ కూడా వంతెనపై నుంచి జారి మృత్యువాత పడటం విషాదకరం.