కన్న కూతుళ్లను బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది ఓ కన్నతల్లి. కామారెడ్డిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. పెద్ద కూతుర్ని చాలా కాలంగా వేధిస్తున్న తల్లి తాజాగా మైనర్ అయిన చిన్న కూతురిమీద కూడా అఘాయిత్యానికి ఒడి కట్టింది. బతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్లిన తండ్రి రావడంతో ఈ విషయం బైట పడింది. వివరాల్లోకి వెడితే. 

కామారెడ్డికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త బతుకుతెరువుకోసం విదేశాలకు వెళ్లాడు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడిందో ఏమో కానీ పెద్ద కూతుర్ని మెదక్‌ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌తో పాటు మరొక యువకుడి దగ్గరకు తరచూ పంపించేది. 

కూతురు వెళ్లనంటే బలవంతంగా బెదిరించి మరీ పంపేది. కొంతకాలానికి ఆ దుర్గార్గుల కన్ను మైనర్ అయిన చిన్న కూతురి మీద పడింది. అలా చిన్న కూతురిని కూడా వాళ్ల దగ్గరకు పంపడం మొదలుపెట్టింది. కొద్దికాలంగా సాగుతున్న ఈ ఘటన తండ్రి రాకతో బైటపడింది.

విదేశాలకు వెళ్లిన తండ్రి తిరిగి రావడంతో కూతుళ్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తండ్రి సహాయంతో ఇద్దరు కూతుళ్లు జిల్లా ఎస్పీ శ్వేతను కలిసి తమకు జరిగిన అన్యాయాన్నిచెప్పారు. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు. పిల్లలను తార్చిన తల్లితో పాటు నిందితులైన కానిస్టేబుల్, మరో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.