లేడీ టెక్కీ రేప్ కేసులో ట్విస్ట్: ట్రాప్ చేసిందని...

Twist in lady techie case in Hyderabad
Highlights

ఉపేంద్ర వర్మ అనే యువకుడిపై లేడీ టెక్కీ పెట్టిన కేసు కొత్త మలుపు తిరిగింది.

హైదరాబాద్: ఉపేంద్ర వర్మ అనే యువకుడిపై లేడీ టెక్కీ పెట్టిన కేసు కొత్త మలుపు తిరిగింది. ఫేస్ బుక్ ద్వారా మోసం చేసి తనపై అత్యాచారం చేశాడని ఓ లేడీ టెక్కీ ఉపేంద్ర వర్మ అనే యువకుడిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

లేడీ టెక్కీ తప్పుడు కేసులు పెట్టి తమ కుమారుడిని జైలుపాలు చేసిందని, ఆమెకు పలువురు యువకులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఉపేందర్‌ వర్మ తండ్రి మహావీర్‌ ప్రసాద్‌ ఆరోపించారు. వాటికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలతో నగర పోలీసు కమిషనర్‌కు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

ఆదివారం సుల్తాన్‌బజార్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో 30 ఏళ్లుగా మయూర్‌ పాన్‌షాపు పేరుతో 8 బ్రాంచ్‌లను కొనసాగిస్తున్నామని, ఇప్పటివరకు తమ పాన్‌షాపులపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. మూడేళ్ల క్రితం ఆ యువతి తన కుమారునికి పరిచయమై సన్నిహితంగా తిరిగిన విషయం నిజమేనని అన్నారు.
 
ఆ సమయంలో రహస్యంగా ఫొటోలు, వీడియోలను తీసి వాటిని అతనికి చూపించి బెదిరించిందని, దాదాపు రూ.40 లక్షలు వసూలు చేసిందని చెప్పారు. వేధింపులు తీవ్రమవడంతో ఉపేందర్‌వర్మ 6నెలల నుంచి ఆమెకు దూరంగా ఉంటూ డబ్బులివ్వడం మానేశాడని చెప్పారు. దీంతో 3నెలల క్రితం బోయిన్‌పల్లిలోని తమ ఇంటికొచ్చి గొడవ చేసిందని, రూ.కోటి విలువచేసే ఇంటితోపాటు రూ.50 లక్షలు బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని డిమాండ్‌ చేసిందని అన్నారు.
 
తమ కుమారుడితోపాటు నగరానికి చెందిన నవనీత్‌, అనిరుధ్‌, వినయ్‌లతో ఆమె సంబంధాలు పెట్టుకుని ఒక్కొక్కరి నుంచి రూ.5-8 లక్షలు వసూలు చేసిన వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. డబ్బులు ఇవ్వలేనని ఉపేందర్‌వర్మ తెగేసి చెప్పడంతో నాలుగు రోజుల కింద కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపించిందని అన్నారు. 

తమ షాపులో విక్రయిస్తున్న పాన్‌లలో మత్తు పదార్థాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని. తమ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు ఆ యువతి ఫేస్‌బుక్‌ స్నేహితుడు హరితోపాటు మరికొంత మంది మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

loader