Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్:అధికార పార్టీ నేతలకు సంస్థాగతంగా తొలగని ఇక్కట్లు

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో సంస్థాగతంగా కమిటీల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

TRS to fill its vacant posts
Author
Hyderabad, First Published Feb 25, 2020, 7:02 PM IST

హైదరాబాద్ :వరుసగా రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ రాష్ట్రస్థాయిలో  పార్టీ పరంగా పూర్తి కార్యవర్గం ఏర్పాటు చేయలేదు. జిల్లా స్థాయిలో పార్టీ కార్యవర్గాలు లేకపోవడం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

 గ్రామ, మండల కమిటీలు మాత్రమే కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకున్నారు.  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొలువు దీరిన తర్వాత పార్టీలో సంస్ధాగతంగా  మార్పులు  ఉంటాయని నేతలంతా అంచనా వేసినా ఇప్పటివరకు కీలక మార్పులు చోటు చేసుకోలేదు.

 నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు భర్తీ చేస్తారన్న అంశంపై ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. జిల్లాస్థాయిలో అధ్యక్ష పదవులను రద్దు చేస్తూ గతంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రత్యామ్నాయంగా జిల్లాలో సమన్వయకర్తలను నియమించి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని భావించింది. కానీ సమన్వయకర్తల నియామకం కూడా ఇప్పటివరకు చేపట్టలేదు. కొత్త జిల్లాల ఆధారంగా మొత్తం జిల్లాలకు జిల్లా అధ్యక్షులు లేకపోవడంతో రాష్ట్ర  ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఇతర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

 మరో రెండు నెలల్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత పార్టీ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంటుందన్న అంచనాతో పార్టీ నేతలు ఉన్నారు. అధికార పార్టీ కావడంతో నామినేటెడ్ పోస్టులు దక్కక పోయినా పార్టీలో వచ్చే ఏదైనా కీలక పదవి వస్తే గుర్తింపు లభిస్తుందన్న ధీమాను పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios