అసలే అధికార పార్టీ.. ఆ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడం అంటే మామూలు విషయం కాదు కదా? ప్రస్తుతం జోగినిపల్లి సంతోష్ అధికార టిఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ పార్టీలో సంతోష్ ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చారు. ముందుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కేసిఆర్ పిఎ గా పనిచేశారు. తర్వాత మెల్ల మెల్లగా టిన్యూస్ కు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఇడి) గా నియమితులయ్యారు. ఆ తర్వాత మరో మెట్టు ఎక్కి టిఆర్ఎస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. మరికొద్ది రోజుల్లోనే టిఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడైపోయారు.

రాజ్యసభ సభకు ఎన్నికవడంతో సంతోష్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఫలితాలు వచ్చిన వెనువెంటనే సంతోష్ ప్రగతిభవన్ వెళ్ళి సిఎం కేసిఆర్ కాళ్ల మీద పడి సాష్టాంగ ప్రమాణం చేశారు. తనకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

టిఆర్ఎస్ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు సంతోష్ కుమార్ కేసిఆర్ కు నీడలా ఉన్నారు. కేసిఆర్ అడుగు జాడల్లో నడుస్తూ వచ్చారు. టిఆర్ఎస్ పార్టీలో కేసిఆరే సంతోష్.. సంతేషే కేసిఆర్ అన్నంతగా నడిచారు సంతోష్. కేసిఆర్ ఆరోగ్య విషయంలో మంచి చెడులు చూసుకునేది సంతోషే. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఉత్సకతతో ఉన్న కేసిఆర్ కు సంతోష్ సేవలు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతోనే రాజ్యసభకు పంపినట్లు కేసిఆర్ చెప్పుకున్నారు కూడా. సంతోష్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం పట్ల టిఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టిఆర్ఎస్ నేతలకు తలలో నాలిక లా సంతోష్ వ్యవహరించేవాడన్న పేరుంది. 

రాజ్యసభ సభ్యుడిగా 32 ఓట్లతో గెలిచారు సంతోష్. తర్వాత అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వద్ద రాజ్యసభ సభ్యుడిగా గెలిచినట్లు ఎన్నికల ధృవపత్రం తీసుకున్నారు. అసెంబ్లీలో సంతోష్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సర్టిఫికెట్ తీసుకునే వీడియోను అసెంబ్లీ సిబ్బంది మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియో కింద ఉంది చూడండి.

 

మొత్తానికి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు గుప్పించినా సంతోష్ ను రాజ్యసభకు పంపాలనుకున్న కేసిఆర్ పంపేశారు. కుటుంబ పాలన అని ఆరోపించినా, ఇప్పటికే నలుగురు కుటంబసభ్యులకు పదవులు అని విమర్శలు వచ్చినా, బంగారు తెలంగాణ కాదు బంగారు ఫ్యామిలీ అని కామెంట్స్ వచ్చినా డోంట్ కేర్ అంటూ కేసిఆర్ తనదైన శైలిలో సంతోష్ కు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు.