నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో ఎట్టకేలకు పెద్దపులి జాడ కనిపించింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలకు దాదాపు ఏడాది విరామం తర్వాత పులి చిక్కింది.  కొన్నాళ్లుగా అడపా దడపా పులి సంచారంపై ప్రచారం జరుగుతున్నా ఖచ్చితమైన ఆదారాలు లేవు. తాజాగా పులుల కెమెరా కంటికి చిక్కడంతో కవ్వాల్ అభయారణ్యం మళ్లీ వన్యమృగాల నివాసానికి అనువుగా మారుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

కవ్వాల్ పరిధిలో పులుల శాశ్వత ఆవాసానికి అనువుగా పరిస్థితులు లేవన్న వాదనలు గతంలో  వినిపించేది.  అయితే కొంత కాలంగా కవ్వాల్ కోర్ ఏరియాలో అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ప్రస్తుతం సత్ఫలితాలను ఇస్తున్నాయి. అటవీ ప్రాంతంలో మానవ సంచారం, చెట్లు కొట్టడం, పెంపుడు జంతువులు మేపటాన్ని అటవీ శాఖ నిషేధించింది. సుమారు 22 వేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో, ఐదు వేల హెక్టార్లను వివిధ గ్రామాల ప్రజలకు, పశువులు, గొర్రెల పెంపకానికి అనుమతిని ఇచ్చి, మిగతా ప్రాంతంలో పూర్తిగా నియంత్రణను అమలు చేశారు. సమీప గ్రామ ప్రజల్లో ఆ దిశగా చైతన్యం కూడా అటవీ శాఖ తీసుకువచ్చింది.

 కోర్ ఏరియా ప్రాంతంలో సహజ గడ్డి క్షేత్రాల పెంపుకు అటవీ శాఖ ప్రాధాన్యతను ఇచ్చింది. జంతువుల కోసం తాగునీటి వసతిని కూడా పెంచింది. దీంతో శాఖాహార జంతువుల ఆవాసం, సంఖ్య బాగా పెరిగింది. వీటిపై ఆధారపడే మాంసాహార జంతువులు సంఖ్య కూడా కొంత కాలంగా పెరుగుతూ వస్తోంది. 

ఇక కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు కూడా ఓ కొలిక్కి వచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాంపూర్, మైసంపేట గ్రామాల తరలింపుకు స్థానికులు అంగీకరించటంతో, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల నిధుల విడుదలతో పాటు, తరలింపుకు ఆమోదం తెలిపింది. ఇలా వరుసగా అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటంలో భాగంగానే కవ్వాల్ లో పులులు, చిరుతలతో పాటు శాఖాహార జంతువుల సంఖ్య, సంచారం కూడా పెరిగింది.

అటవీ శాఖ సిసి కెమెరాకు చిక్కిన పోటో ఆరోగ్యంగా ఉన్న మగ పులిదని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సి. శరవనన్ తెలిపారు. పులి జాడ అటవీ శాఖ అధికారులు, సిబ్బందిలో సంతోషాన్ని నింపింది. కవ్వాల్ ప్రాంతం పులులకు శాశ్వత అవాసంగా ఉండేలా మరిన్ని పకడ్బంధీ చర్యలు తీసుకోవాలని, స్థానిక గ్రామాల ప్రజలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ,  పెంపుడు జంతువులు, మనుషుల సంచారాన్ని పూర్తి స్థాయిలో నివారించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) పీ.కె.ఝా ఆదేశించారు.