హైదరాబాద్: హైద్రాబాద్ లో మరో దారుణం చోటు చేసుకొంది. దిశ ఘటన జరగడానికి ఒక్క రోజు ముందే మతిస్థిమితం సరిగా లేని యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.ఈ ఘటనలో నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ కుల్సుంపురా పరిధిలోని 19 ఏళ్ల యువతి తల్లి, సోదరులతో కలిసి నివాసం ఉంటుంది. మానసిక సరిగా లేని యువతి ఇల్లు విడిచి వెళ్లిపోతోంది. సోదరులు ఆమెను వెతికి ఇంటికి తీసుకొచ్చేవారు. 

ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన కూడ ఆ యువతి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆ రోజు సాయంత్రం పురానాపూల్ చౌరస్తా వద్ద ఉన్న ఆ యువతిని ఖలీమ్, అతని బంధువు అబ్దుల్ అజీజ్ లు  ఆటోలో మూసీ నది ఒడ్డుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

అదే రోజు రాత్రి ఆ యువతిని తిరిగి జుమ్మెరాత్ బజార్ చౌరస్తాలో దింపి అక్కడే ఉన్న నజీర్ అనే వ్యక్తికి ఈ యువతిని అప్పగించి బాధితురాలిని ఇంటి వద్ద దింపాలని సూచించారు.

అప్పటికే ఆ యువతి కోసం ఆమె సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు యువతి సోదరులు కూడ ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ సమయంలో పురానాపూల్ వద్ద యువతి కన్పించింది.కుల్సుంపురా పోలీసులు బాధిత యువతిని మానసిక నిపుణులు, వైద్యుల సహాయంతో ఏం జరిగిందో తెలుసుకొని చికిత్స అందించారు. 

బాధితురాలు అందించిన వివరాల ఆధారంగా సీసీటీవీ పుటేజీని ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. తొలుత నజీర్ ఆ  తర్వాత మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.