Telangana: తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎండల తీవ్రత అధికం కావడంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వడదెబ్బ బారినపడ్డ వారి సంఖ్య రెండేండ్ల గరిష్టానికి చేరుకుంది.
Sunstroke: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎండల తీవ్రత అధికం కావడంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వడదెబ్బ బారినపడ్డ వారి సంఖ్య రెండేండ్ల గరిష్టానికి చేరుకుంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకడంతో ఫిబ్రవరి-మార్చి నెలల్లో 40 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ఇది గత రెండు సంవత్సరాలతో పోలిస్తే గరిష్ట స్థాయి అని గణాంకాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికం కావడంతో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (EMRI) మరియు ఆరోగ్య నిపుణులు రాష్ట్రంలో హీట్‌స్ట్రోక్ పెరుగుతున్న సంభావ్యతకు సంబంధించి హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ సహా మూడు జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో వడదెబ్బ బారినపడ్డ వారిని 108 అత్యవసర అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ఒక నెలలో నమోదైన మొత్తం కేసుల్లో ఇవి 0.05 శాతం. ఫిబ్రవరి నెలలో 17 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి.
"గత సంవత్సరంలో, వేడి గాలులు చాలా వరకు తూర్పు వైపు ఉన్నాయి, ఈ సంవత్సరం గాలులు ఈశాన్య దిశలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ వైపు పొడిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఒకటి లేదా రెండు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాకు ఇంకా హీట్ వేవ్ లేదు” అని భారత వాతావరణ శాఖ, తెలంగాణ హెడ్ కె నాగరత్న మీడియాతో అన్నారు.
వడదెబ్బ కేసుల నమోదును ధ్రువీకరిస్తూ.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతున్నదని తెలిపారు. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. "మేము ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కేసులు చూస్తున్నాము. ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే హీట్ వేవ్ హెచ్చరికను జారీ చేసాము. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండలు తీవ్రత అధికంగా ఉంటే మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండాలి" అని ఆయన సూచించారు.
కాగా, రాష్ట్రంలో గురువారం నాడు వడదెబ్బ కారణంగా స్పృహతప్పి ఇద్దరు వ్యక్తులు మరణించారు. చనిపోయిన ప్రాణాలు కోల్పోయిన వారిలో జైనద్ మండల కేంద్రానికి చెందిన రైతు విట్టల్, బెల్లంపల్లి పట్టణానికి చెందిన సంపత్ కుమార్ లు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని చాప్రాల్ గ్రామంలో 43.8 డిగ్రీలు, జైనద్‌లో 43.67, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌లోని కెరమెరిలో 43.8, కౌటాలలో 43.3, నిర్మల్ జిల్లా లింగాపూర్‌లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో తొలిసారిగా ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. వేడి వాతావరణంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.
