Asianet News TeluguAsianet News Telugu

భయోత్పాతం, కేంద్రం బండారం బయటపడుతుంది: ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. దేశం ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని, కేంద్రం ఆర్థిక పరిస్థితి బండారం బయటపడుతుందని ఆయన అన్నారు.

Telangana municipal election results 2020: KCR blames Modi Govt for financial crisis
Author
Hyderabad, First Published Jan 25, 2020, 6:25 PM IST

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 57 ఏళ్లు దాటిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని, దాన్ని ఈ బడ్జెట్ లోనే ప్రవేశపెడుతామని, మార్చి 31వ తేదీ నుంచి దాన్ని ఇస్తామని ఆయన చెప్పారు. లబ్ధిదారుల సంఖ్య కూడా ఖరారైందని ఆయన చెప్పారు. దానికి మంత్రులు ఉప సంఘం వేస్తామని ఆయన చెప్పారు. 

మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆయన శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల వయోపరిమితి కూడా పెంచుతామని, పీఆర్సీ రిపోర్టు తీసుకుని దాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. 

కేటీఆర్ సారధ్యంలో మరో అద్భుతం... మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం ...

పీఆర్సీ అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెబుతూ ఆయన కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉందని ఆయన అన్నారు. భయోత్పాతంగా ఉందని ఆయన చెప్పారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం సరిగా లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనా సరళి సరిగా లేదని ఆయన అన్నారు. రూ. 5 వేల కోట్ల జీఎస్టీ తమకు కేంద్రం నుంచి రావాల్సి ఉందని ఆయన చెప్పారు. తాము పార్లమెంటులో, వెలుపలా పోరాటం చేస్తే కొంత విడుదల చేసిందని ఆయన చెప్పారు.

ఈ స్థితిలో ఉద్యోగులకు వేతనాలు పెంచడం కొంత కష్టంగానే ఉందని, వారిని పిలిచి మాట్లాడుతానని ఆయన చెప్పారు. ఎక్కడి నుంచి నిధులు తేవాలో ఆలోచిస్తామని ఆయన చెప్పారు. పరిమితులను వారికి వివరిస్తానని, అయితే తృణమో ఫణమో ఇవ్వాలి కాబట్టి ఎదో మేరకు పెంచుతామని ఆయన చెప్పారు.

ఎన్టీఆర్ వేవ్, ఇందిరా వేవ్ చూశా, ఇటువంటి వేవ్ చూడలేదు: కేసీఆర్

కేంద్రం గురించి గమ్మత్తు విషయం తెలుస్తోందని, అయితే, అది బయటపడుతుందని, ప్రభుత్వం చెప్పకపోయినా కాగ్ చెబుతుందని,  కాగ్ లెక్కలు పార్లమెంటులో పెట్టాల్సి ఉంటుందని, కాబట్టి ఆ గమ్మత్తేమిటో తెలిసిపోతుందని ఆయన అన్నారు. లెక్కలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి బండారం బయటపడుతుందని ఆయన అన్నారు.

దేశంలో జీడీపీ సున్నా అయిపోయిందని, వచ్చే ఏడాది కూడా సున్నానే అయ్యే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. తమ రాష్ట్రం గత ఐదేళ్ల పాటు ఎంజాయ్ చేసిందని, ఇండియాలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండేదని, ఏడాదికి ఏడాది 21 శాతం పెరుగుదల ఉందని కాగ్ చెప్పిందని ఆయన వివరించారు. 200 కోట్లు, 300 కోట్లు ఇవ్వడమంటే సులభంగా ఉండేదని ఆయన చెప్పారు. 

అయితే, ప్రస్తుతం విపత్కర పరిస్థితి ఉందని, పరిస్థితి దిగజారుతోందని ఆయన చెప్పారు. పెరుగుదల 21 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోయిందని, ఇప్పుడు కాస్తా బాగుందని, అది 9.5 శాతం పెరుగుదల ఉందని ఆయన చెప్పారు. డబ్బులకు ఇబ్బంది ఉన్నప్పటినకీ పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios