నారాయణ, శ్రీచైతన్య కాలేజీల వ్యవహారంపై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ఇంటర్ బోర్డు విచారణ నివేదికను సమర్పించింది. సుమారు 45 కాలేజీలు నిబంధనలకు అనుగుణంగా లేవని తెలిపింది.

నిబంధనలు పాటించని కాలేజీల్లో సుమారు 20 వేలమంది విద్యార్ధులు చదువుకుంటున్నారని బోర్డు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో నిబంధనలు పాటించని కాలేజీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కోర్టు.. ఇంటర్ బోర్డును ప్రశ్నించింది.

Also Read:నిబంధనలు పాటించని కళాశాలలపైకొరడా: 4లక్షల మంది విద్యార్థుల్లో టెన్షన్

గుర్తింపు లేని కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధులు పరిస్ధితి ఏంటని అడిగింది. విద్యార్ధుల భవిష్యత్తుతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లో ఈ నెల 25లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

గతేడాది జూలై నెలలో తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు పాటించని ఇంటర్ కళాశాలలపై కొరడా విధించింది ఇంటర్మీడియట్ బోర్డు. రాష్ట్ర వ్యాప్తంగా 1,338 ఇంటర్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

కేవలం 361 కళాశాలలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది ఇంటర్ బోర్డు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలు నిబంధనలకు తిలోదకాలిస్తూ కళాశాలలను నడిపిస్తున్నారంటూ ఇంటర్ బోర్డు ఆరోపించింది. విద్యార్థుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. 

Also Read:శ్రీచైతన్య కాలేజీ సీజ్

రాష్ట్రవ్యాప్తంగా 50 కళాశాలల్లో ఫైర్ సేఫ్టీ అనేది కనిపించలేదని స్పష్టం చేసింది. ఇకపోతే నిబంధనలు పాటించని కళాశాలల్లో అత్యధికం కార్పొరేట్ సంస్థలైన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే అధికంగా ఉండటం విశేషం.

ఇకపోతే 1338 కళాశాలల గుర్తింపు రద్దు చేయడంతో సుమారు 4లక్షల మంది విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మెుదలైంది. తమ విద్యార్థుల భవిష్యత్ పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు తల్లిదండ్రులు