కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హై కోర్ట్ సీరియస్ అయ్యింది. మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయట్లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 

మృతదేహం నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించినప్పుడు మాత్రమే అతడు ఎలా చనిపోయాడో తెలుస్తుందని, ఒకవేళ అతడు కరోనా వైరస్ వల్ల గనుక చనిపోయి ఉంటే.... అప్పుడు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించే వీలుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. 

అలా చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తి కాకుండా అడ్డుకోవచ్చని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించకపోతే సదరు వ్యక్తి ఎలా చనిపోయాడా తెలియక చాలా పెద్ద ప్రమాదానికి ఇది దారి తీసే ఆస్కారం ఉందని కోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. 

పత్రికల్లో వచ్చినవార్తా  కథనాల ప్రకారంగా  ప్రాథమిక లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అర్థమవుతుందని, ఇది సరైన పద్ధతి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

కరోనా లక్షణాలుంటేనే పరీక్షలు చేసే విధానానికి ఏమైనా శాస్త్రీయత ఉందా? ఉంటే... ఆ శాస్త్రీయత ఏమిటో వివరించాలని కోర్టు తెలిపింది.  కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కావాలంటే... లక్షణాలున్న వారికి, వారి సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు ఇలా అందరికీ పరీక్షలు నిర్వహించినప్పుడు మాత్రమే వీలవుతుందని, వీరితోపాటుగా మరణించిన వారికి కూడా ఈ కరోనా పరీక్షలు చేయాలని కోర్టు సూచించింది. 

కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశరరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

ఇలా గనుక పరీక్షలు నిర్వహించకపోతే కరోనా వ్యాప్తి లెక్కలు తేలవని, పైగా అంకెల గారడీతో జనాన్ని కరోనా వైరస్ విషయంలో మభ్యపెట్టడమే అవుతుందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం వాస్తవిక పరిస్థితుల కోణంలో ఆలోచించాలని, మనల్ని మనమే మోసం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది.

జంటనగరాల్లోని 32 కంటైన్‌మెంట్‌ జోన్స్‌లోని వారికి పరీక్షలు నిర్వహించాలని పెటిషర్ తరుఫు న్యాయవాది కోరారు. ప్రభుత్వం తరుపున వాదిస్తున్న అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ... ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని తెలిపారు. 

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కరోనా వైరస్‌ అనుమానితులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయడమే కాకుండా క్వారంటైన్‌ సెంటర్స్‌కు పంపాలని కూడా మార్గదర్శకాల్లో ఉందని చెప్పింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలు  సమర్పించాలని ఆదేశిస్తూ... కోర్టును 14వ తేదికి వాయిదా వేసింది.