కరోనా దెబ్బతో హెద్రాబాద్ మెట్రో కు రూ. 400 కోట్ల నష్టం: ప్రభుత్వం సహాయం చేసే ఛాన్స్
కరోనా హైద్రాబాద్ మెట్రో రైలుకు తీవ్ర నష్టాల్ని తెచ్చి పెట్టింది. గత ఐదు మాసాలుగా హైద్రాబాద్ లో మెట్రో రైలు ఈ ఏడాది మార్చి 22వ తేదీనుండి నిలిచిపోయింది. అన్ లాక్ 4 ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో మెట్రో రైళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
హైదరాబాద్: కరోనా హైద్రాబాద్ మెట్రో రైలుకు తీవ్ర నష్టాల్ని తెచ్చి పెట్టింది. గత ఐదు మాసాలుగా హైద్రాబాద్ లో మెట్రో రైలు ఈ ఏడాది మార్చి 22వ తేదీనుండి నిలిచిపోయింది. అన్ లాక్ 4 ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో మెట్రో రైళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
కరోనా నేపథ్యంలో మార్చి నుండి మెట్రో రైలు సేవలు నిలిచిపోవడంతో ఇప్పటికే సుమారు రూ. 400 కోట్లకు పైగా నష్టపోయినట్టుగా మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. మెట్రో రైలు సేవలు నిలిచిపోతే ప్రతి నెల రూ. 45 కోట్లు హైద్రాబాద్ మెట్రో రైల్వే సంస్థకు వాటిల్లనుంది.
5 నెలలుగా రైళ్లు స్టేషన్లకే పరిమితం కావడంతో రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. మెట్రో రైళ్లు నడిస్తే ఇతర వ్యాపారాల ద్వారా మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఆదాయాన్ని కూడ మెట్రో రైలు కోల్పోయింది.
మూడు కారిడార్లలో రూ. 16 వేల కోట్లతో హైద్రాబాద్ లో మెట్రో రైలు నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రతి ఏటా హెచ్ఎంఆర్ రూ.1300 కోట్లను వడ్డీ కింద చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రాజెక్టు వ్యయం రూ. 21 వేల కోట్లకు పెరిగిందని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ప్రతి రోజూ 9 లక్షల మంది ప్రయాణీకులను ఏడాది మొత్తం తమ గమ్యస్థానాలకు చేర్చితే మెట్రో రైలు లాభాల్లోకి వెళ్లనుందని హెచ్ఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో రైలుకు మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఆర్ధిక సహాయం చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు.
లాక్ డౌన్ సమయంలో వ్యాపారానికి ఎన్ని రోజుల పాటు మెట్రోరైలు దూరంగా ఉన్నారనే విషయాన్ని పరిశీలించి ఆర్దిక ప్యాకేజీ అందిస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే ఆర్ధిక సహాయం కోసం హైద్రాబాద్ మెట్రో రైలు వర్గాలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఆ సమయంలో ప్యాకేజీ ఇచ్చేందుకు అవకాశం లేకపోలేదు.
వచ్చే నెలలో మెట్రో సర్వీసులకు కేంద్రం అనుమతిని ఇచ్చే అవకాశం ఉన్నందున హెచ్ఎంఆర్ అధికారులు కూడ రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రద్దీని నివారించేందుకు గాను రైళ్ల ఫ్రీక్వెన్సీని హెచ్ఎంఆర్ పెంచాలని భావిస్తున్నారు.
అన్ని మెట్రో స్టేషన్లలో ఐసోలేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతారు. ప్రయాణీకులకు హెల్ప్ లైన్ నెంబర్లు కూడ ఇవ్వనున్నారు. సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రైళ్లలో ప్రత్యామ్నాయ సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు.