సౌత్ లో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయినోళ్లే లేరు.. మరి కేసీఆర్ పరిస్థితేంటి?

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డనాటినుంచి జరిగిన మూడోఎన్నికలు ఇవి. మరి ఈ సారి అధికార బీఆర్ఎస్ మళ్లీ తానే అధికారంలోకి వస్తుందా? వరుసగా మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించబోతుందా? బీఆర్ఎస్ నాయకులు చెబుతుంది నిజమవుతుందా? అసలు దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఉందా?  ఈ చరిత్రను కేసీఆర్ తిరగరాస్తారా?

telangana election results : will kcr win and become 1st Hat-trick Cm From South? - bsb

డిసెంబర్ మూడున తెలంగాణలో ఏం జరగబోతోంది? అధికారం ఎవరికి కిరీటాన్ని పెట్టబోతోంది? బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మూడోసారి ముచ్చటగా సీఎం అవుతారు. దీంతోపాటు సరికొత్త రికార్డునూ నెలకొల్పుతారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటివరకూ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన నేతగా ఆవిర్భవిస్తారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో ఇప్పటివరకు రెండు సార్లకు మించి ముఖ్యమంత్రి అయిన చరిత్ర లేదు. 

తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, జయలలిత, కరుణానిధి.. కర్ణాటకలో సిద్ధరామయ్య, బీఎస్ యడియూరప్ప, కేరళలో అచుతా మీనన్, కె. కరుణాకరన్,  ఎ.కె. ఆంటోని, పినరయ్ విజయన్ లు.. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి వస్తే.. ఎన్టీఆర్ లు అత్యధిక కాలం లేదా పూర్తి పదవీ కాలం కాకుండా రెండు, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 

తమిళనాడు

ముందుగా తమిళనాడు తీసుకుంటే.. ఎం కరుణానిధి 1971లో ఒకసారి, 1976లో ఒకసారి గెలిచారు. కానీ పూర్తి పదవీ కాలం ఉండలేదు. మళ్లీ 1989లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సారి రెండేళ్లు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తరువాత 1996లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. మరోసారి 2006లో పూర్తి సమయం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సారి పూర్తి పదవీకాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు. అలా చూసుకుంటే కరుణానిధి ఐదు పర్యాయాలు కలిపి 19 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 

ఆ తరువాత ఎంజీ రామచంద్రన్ 1977లో ఒకసారి రెండేళ్లపాటు, ఆ తరువాత 1980-1987 వరకు ఏకధాటిగా ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ లెక్కన మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 1980లో 112 రోజులపాటు తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఉంది. ఆ తరువాత మళ్లీ 1980లో మదురై వెస్ట్,  1985లో అండిపట్టి నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. మూడుసార్లు కలిపి దాదాపుగా పదేళ్ల రెండు నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

ఈ వరుసలో ఉన్న మరో ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మొదటి సారి 2001లో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కేవలం 130 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తరువాత 2002లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు  ఈ సారి 4 సం.ల 71 రోజులు పదవిలో ఉన్నారు. మరోసారి 2011లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సారి కూడా పూర్తి పదవీ కాలం ఆమె పాలన సాగలేదు. మూడేళ్ల 134 రోజుల్లోనే పదవీచ్యుతులయ్యారు. నాలుగోసారి 2015లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి సంవత్సరం ఏడు నెలలపాటు పదవిలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే జయలలిత నాలుగు సార్లకు గానూ...దాదాపుగా పదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కర్ణాటక

ఇక కర్ణాటకకు వస్తే నిజలింగప్ప 1956, 1968లలో రెండుసార్లు మొదటి, నాల్గో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 1972, 73, 1978లలో డి. దేవరాజ్ ఉర్స్ మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మధ్యలో 1977లో రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఈ మూడుసార్లూ కలిపి మొత్తంగా 8 సంవత్సరాలలోపే ఆయన పాలన ఉంది. మరో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప 2007లో ఏడు రోజులు, 2008లో మూడేళ్ల 67 రోజులు, 2018లో ఆరు రోజులు, 2019లో రెండేళ్ల, రెండు రోజులు...ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొత్తంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కానీ పదవీ కాలానికి వస్తే ఆరేళ్లలోపే ఉంది. ఇక ఇదే కోవలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా 2013లో ఒకసారి, 2023లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో పూర్తికాలం పదవిలో ఉన్నారు. ప్రస్తుతం 2023 మే నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

కేరళ

కేరళకు వస్తే.. అచుతా మీనన్ 1969 నుండి 1977 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కె. కరుణాకరన్ 1977లో ఒకసారి, 1981లో,1982లో, 1991లో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొత్తంగా కలిపి పదేళ్లపైగా పదవీకాలం ఉంది. ఆ తరువాత ఎ.కే ఆంటోనీ రెండుసార్లు, పినరయ్ విజయన్ రెండుసార్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

చివరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వస్తే.. నీలం సంజీవరెడ్డి 1956లో మూడేళ్లపై చిలుకు, 1962లో దాదాపు రెండేళ్లు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత నందమూరి తారకరామారావు ఓ ప్రభంజనంలా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. అలా 1983లో సంవత్సరం, 220 రోజులు, 1984లో 174 రోజులు, 1985లో 4 యేళ్ల 269 రోజులు, 1994లో  263 రోజులు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ఉన్నారు. కానీ మొత్తంగా కలిపి ఆయన పదవీ కాలం దాదాపు పదేళ్లు మాత్రమే. 

అయితే వీరంతా వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రులు అయినవారు కాదు. ఒకవేళ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రులు అయినా పూర్తి పదవీకాలం బాధ్యతల్లో లేరు. మరోవైపు మూడుసార్లు వరుసగా ఎన్నికవ్వలేదు. ఇవన్నీ చూసుకుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 జూన్ రెండోతేదీనుంచి నేటివరకు ముఖ్యమంత్రిగా అప్రతిహతంగా కొనసాగుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే.. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యి దక్షిణాది రాష్ట్రాల్లో చెరగని చరిష్మా ఉన్న నాయకుడిగా సరికొత్త రికార్డును నెలకొల్పుతారు. మరి డిసెంబర్ 3 ఏం జరగబోతోంది? వేచి చూడాల్సిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios