రైతు సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. తెలంగాణాలో  రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు  చేయకపోవడంతో  ప్రభుత్వ  వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ కిసాన్ సెల్ ఆద్వర్యంలో భేటీ అయిన నేతలు పలు అంశాలపై చర్చించారు. రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టినా..... సక్రమంగా అమలు చేయడం లేదని సమావేశం అభిప్రాయ పడింది. 

 రైతురుణమాఫి పై ప్రభుత్వానికే స్పష్టత లేదని   రెండో సారి ప్రభుత్వ పగ్గాలు  చేపట్టి ఏడాది కాలం గడిచినా.... ఇంకా రుణమాఫి గురించి  ఉసెత్తకపోవడాన్ని అసెంబ్లీ సమావేశాల్లో  ప్రస్తావించాలని నిర్ణయం తీసుకుంది.

 తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా.... న్యాయం జరుగడం లేదని ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలందరికీ ఆరు లక్షల రుపాయల ఆర్ధిక సహాయం అందచేయాలని సమావేశం డిమాండ్ చేసింది.కంది రైతులు ప్రభుత్వ కొనుగోళ్లు సక్రమంగా లేకపోవడంతో  తీవ్ర ఇబ్బందుల పడుతున్నారని, కంది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కిసాన్ సెల్ డిమాండ్ చేసింది.

 రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీయడంతో పాటు ప్రజా క్షేత్రంలో రైతుల మద్దతుతో ప్రత్యక్ష ఆందోళనలకు త్వరలో కార్యాచరణ ప్రకటించాలని కిసాన్ సెల్ సమావేశం నిర్ణయం తీసుకుంది.