ఏఐసీసీ సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందడంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో తన నియోజకవర్గం మధిరలో ఆయన నిర్వహిస్తోన్న పాదయాత్రకు బ్రేక్ పడింది. 

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. ఈ నెల 4న ఢిల్లీలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో భేటీకి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో భట్టి తన పాదయాత్రకు తాత్కాలికగా విరామం ప్రకటించారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క పాదయాత్ర బోనకల్లు మండలంలో వుంది. ఏఐసీసీ సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా బోనకల్లుకు చేరుకుని తిరిగి తన పీపుల్స్ మార్చి పాదయాత్రు కొనసాగించనున్నారు. 

కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన Mallu Bhatti Vikramarka మధిరలో తన పాదయాత్రను ప్రారంభించారు. అయితే మార్చి 7వ తేదీ నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో అదే నెల 5వ తేదీ సాయంత్రానికి భట్టి విక్రమార్క తన పాదయాత్రను నిలిపివేశారు. మార్చి 6వ తేదీన హైద్రాబాద్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు పాదయాత్రను ప్రారంభిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 

Madira నియోజకవర్గంలోని యడవల్లి గ్రామం నుండి భట్టి విక్రమార్క తన పాదయాత్రను ప్రారంభించారు. 33 రోజుల పాటు 135 గ్రామాల గుండా యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజల నుండి భట్టి విక్రమార్క ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలోనే భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించాలని భావించారు. కానీ కరోనా కారణంగా పాదయాత్రను భట్టి విక్రమార్క వాయిదా వేసుకొన్నారు. ఈ పాదయాత్రకు పీపుల్స్ మార్చ్ అని నామకరణం చేశారు భట్టి విక్రమార్క. ఈ క్రమంలో ప్రతి రోజూ 15 నుండి 20 కి.మీ దూరం పాదయాత్ర కొనసాగించారు.

గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను అమలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భట్టి విక్రమార్క ప్లాన్ చేస్తున్నారు. ఎర్రుపాలెం అమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజులు ముగించిన తర్వాత పాదయాత్రను ముగించనున్నారు.