గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్ధిని నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వ్యవహారం మరచిపోకముందే హైదరాబాద్‌లోనూ అచ్చం ఈ తరహా ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో శుభం యాదవ్ అనే వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని బహదూర్‌పురాకు చెందిన దానబోయిన శుభం యాదవ్ (20) మూడు సంవత్సరాల క్రితం కోఠిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్‌లో చేరాడు. ఈ సమయంలో తోటి విద్యార్ధినిని ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.

ఆమెతో సన్నిహితంగా ఉంటూ నగ్న చిత్రాలు, వీడియోలు సంపాదించాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి కొంత నగదును వసూలు చేశాడు.

ఈ సంగతి బాధితురాలి ఇంట్లో తెలియడంతో ఘర్షణ జరిగింది. అయినప్పటికీ శుభం యాదవ్ తన బుద్ధి మార్చుకోకుండా ఆ బాలికను పదో తరగతి చదువుతున్న ఆమె సోదరి వ్యక్తిగత ఫోటోలు పంపాలంటూ బెదిరింపులకు దిగాడు.

దీంతో భయపడిన ఆమె.. తన సోదరి నగ్న చిత్రాలను నిందితుడికి పంపింది. వెంటనే యాదవ్ వాటిని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పదో తరగతి చదివే బాలికకు పంపి వేధించడం మొదలుపెట్టాడు. భయపడిన ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు శుభం యాదవ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.