డ్రగ్స్ ఇష్యూ: కేటీఆర్ టార్గెట్, రేవంత్ రెడ్డి సవాల్ కు కొండా విశ్వేశ్వర రెడ్డి రెడీ
డ్రగ్స్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ను చిక్కుల్లో పెట్టడానికి కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోంది. రేవంత్ రెడ్డి విసిరిస సవాల్ ను స్వీకరిస్తూ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా వైట్ టెస్టు సిద్ధమంటూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన సవాల్ దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి సవాల్ కు మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై ట్విట్టర్ వేదిక తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధం కావాలని, కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా వస్తారని రేవంత్ రెడ్డి ఇటీవల సవాల్ చేశారు.
రేవంత్ రెడ్డి సవాల్ మీద కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. వ్యవహారంలోకి ఆయన రాహుల్ గాంధీని లాగారు. రాహుల్ గాంధీ పరీక్షకు సిద్ధపడితే తాను రెడీగా ఉన్నానని ఆయన చెప్పారు. అయితే, కేటీఆర్ ను రేవంత్ రెడ్డి వదిలిపెట్టడం లేదు. డ్రగ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక కార్యకర్తగానే కాకుండా పేరెంట్ గా తాను డ్రగ్స్ కు వ్యతిరేకమని కొండా విశ్వేశ్వర రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని ఆయన ఆయన అన్నారు. చాలా మంది సంపన్నుల పిల్లలు డ్రగ్స్ వాడుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆయన అన్ారు. సమాజంలో డ్రగ్స్ విస్తరిస్తూ సమాజాన్ని, కుటుంబాలను భ్రష్టు పట్టిస్తున్నాయని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. వైట్ టెస్టు చేయించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వర రెడ్డి సోమవారం మధ్యాహ్ననం 12 గంటలకు హైదరాబాదులోని గన్ పార్కుకు చేరుకుంటున్నారు.
వైట్ టెస్టుకు సిద్ధపడిన కొండా విశ్వేశ్వర రెడ్డిని కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ప్రశంసించారు. డ్రగ్స్ అంబాసిడర్ సిద్ధపడుతారా అని ఆయన కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. మొత్తం మీద, డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ ను చిక్కుల్లో పడేసే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది.