Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని రుజువు చేస్తే రాజీనామా: బీజేపీ నేతలకు పైలెట్ రోహిత్ రెడ్డి కౌంటర్

బెంగుళూరు డ్రగ్స్ కేసులో తనకు  ఎలాంటి ప్రమేయం లేదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పారు. కర్ణాటక పోలీసులు ఏనాడు తనను విచారణకు పిలవలేదని  ఆయన స్పష్టం చేశారు.

Tandur MLA  Pilot Rohith Reddy  Serious Comments  on BJP Telangana President  Bandi Sanjay
Author
First Published Dec 18, 2022, 11:40 AM IST


హైదరాబాద్: బెంగుళూరు డ్రగ్స్ కేసులో  తనకు ఎలాంటి ప్రమేయం లేదని  తాండూరు  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  స్పష్టం చేశారు.ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎప్ఐఆర్ లలో  తన పేరు లేదన్నారు. కర్ణాటక పోలీసులు తనను ఏనాడూ విచారణకు రావాలని కోరలేదని ఆయన వివరించారు.ఈ కేసుతో సంబంధం ఉందని రుజువు చేస్తే ఎమ్మెల్యే  పదవికి  రాజీనామా చేస్తానని  రోహిత్  రెడ్డి ప్రకటించారు.

ఆదివారంనాడు ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.బెంగుళూరు డ్రగ్స్ కేసులో  తన ప్రమేయంపై ఆరోపణలను రుజువు చేయాలని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి  రోహిత్ రెడ్డి  నిన్న  సవాల్ చేశారు.ఈ విషయమై ఇవాళ ఉదయం వరకు  డెడ్ లైన్ విధించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి  భాగ్యలక్ష్మి ఆలయం వద్ద  ప్రమాణం చేయాలని  బండి సంజయ్ కు  రోహిత్ రెడ్డి సవాల్ చేశారు.  ఈ సవాల్ లో భాగంగానే ఇావాళ మరోసారి రోహిత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. బండి సంజయ్,  రఘునందన్ రావు  చేసిన విమర్శలపై  రోహిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

తనపై  చేసిన  ఆరోపణలు రుజువు చేయాలని  తాను  బండి సంజయ్  కు సవాల్  చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  కానీ  ఈ  ఈ సవాల్ ను బండి సంజయ్  స్వీకరించలేదన్నారు. తాను  చేసిన సవాల్  ను స్వీకరించలేదంటే  తనపై చేసిన  ఆరోపణలు నిజం కాదని  తేలిందన్నారు.  తన సవాల్ ను బండి సంజయ్  ఎందుకు స్వీకరించలేదో  చెప్పాలని  రోహిత్ రెడ్డి ప్రశ్నించారు.  మతం పేరుతో ప్రజలన్ని బీజేపీ రెచ్చగొడుతుందని రోహిత్ రెడ్డి విమర్శించారు.

ఐటీ,ఈడీ, సీబీఐ వంటి సంస్థలను  బీజేపీ తమ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటుందని  రోహిత్ రెడ్డి ఆరోపించారు. తమకు అనుకూలంగా లేని రాజకీయ, వ్యాపార ప్రముఖుల్ని బీజేపీ లక్ష్యంగా  చేసుకుంటుందన్నారు.  తనకు ఈడీ నోటీసుల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.తప్పుదోవపట్టించేలా  బీజేపీ నేతలు తనపై ప్రచారం చేశారని  పైలెట్ రోహిత్ రెడ్డి  చెప్పారు.  

తాను  చేసిన  ఆరోపణలపై  బండి సంజయ్ స్పందించకుండా  ఆ పార్టీకి చెందిన  రఘునందన్ రావు  స్పందించారన్నారు.  తనపై రఘునందన్ రావు  చేసిన విమర్శలపై రోహిత్ రెడ్డి  ఘాటుగా  స్పందించారు.రఘునందన్ రావు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని  ఆయన ప్రశ్నించారు.   న్యాయం చేయాలని  తన వద్దకు  వచ్చిన మహిళను రఘునందన్ రావు  కాటు వేశారని రోహిత్ రెడ్డి ఆరోపించారు.

also read:నందు, సింహయాజీలెవరో తెలియదా... ఏ ఇన్నావోలో , ఎవరితో వెళ్లారో చెప్పమంటారా : రఘునందన్ రావు

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పరిశ్రమల యజమానులను రఘునందన్ రావు బెదిరించలేదా అని ఆయన అడిగారు.ఎంఐఎం నేతల తరపున రఘునందన్ రావు వకాల్తా పుచ్చుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. దొంగస్వాములతో  సంబంధం లేకపోతే  బీజేపీ నేతలు ఎందుకు కోర్టులో కేసులు వేస్తున్నారో చెప్పాలని  రోహిత్ రెడ్డి అడిగారు. సింహయాజీతో  తనకు  ఈ ఏడాది సెప్టెంబర్ మాసానికి  ముందు నుండి  సంబంధాలు లేవని  ఆయన స్పష్టం చేశారు.  సెప్టెంబర్ కు ముందు సింహయాజీతో తనకు సంబంధాలు ఉన్నట్టు రుజువు చేస్తే  తాను  తన ఎమ్మెల్యే  పదవికి  రాజీనామా  చేస్తానని  ఆయన ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios